అర్జున్ సమాచారం:
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ‘అభయహస్తం’పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర ఖజానా ఖర్చుతో హైదరాబాద్లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, ప్రస్తుతం అమలవుతున్న పథకాలకు పొంతన లేదని ఆరోపించారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
బీసీ డిక్లరేషన్లో భాగంగా వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ మూడేళ్లలో రూ.5 వేల కోట్ల లోపే కేటాయించారని ఆరోపించారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం వాటా కల్పిస్తామని చెప్పి.. ఇప్పటివరకు ఒక్క శాతం కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో భాగంగా పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందించే ‘అంబేడ్కర్ అభయహస్తం’ పథకాన్ని ప్రకటించారని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు 31 శాతం వాటా కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
ఈ రెండు హామీల అమలులోనూ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని ఆరోపించారు. యూత్ డిక్లరేషన్లో భాగంగా 365 రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని కేటీఆర్ తెలిపారు. కానీ ఇప్పటివరకు 10 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఆశించిన ప్రయోజనం అందలేదని విమర్శించారు. విద్యార్థులకు రూ.5 లక్షల ‘విద్యా భరోసా కార్డు’ ఇస్తామని చెప్పి ఆ హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. మైనారిటీ డిక్లరేషన్లో భాగంగా రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. అయితే ఇప్పటివరకు రూ.వెయ్యి కోట్ల లోపే కేటాయించారని ఆరోపించారు. ఇలా ప్రతి వర్గానికి ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ‘అబద్ధాలు.. పచ్చి అబద్ధాలు.. వాటన్నింటికీ మించి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో అభయహస్తం’ అంటూ కేటీఆర్ తన పోస్టులో ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం అంతులేనిదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
=====================

