ePaper
Saturday, November 14, 2026
ePaper
Homeఅంతర్జాతీయంక్యూబాలో ఆకలి కేకలు ద్వీప దేశం ఆర్థికవ్యవస్థపై అమెరికా ఇంధన ఆంక్షల ప్రభావం

క్యూబాలో ఆకలి కేకలు ద్వీప దేశం ఆర్థికవ్యవస్థపై అమెరికా ఇంధన ఆంక్షల ప్రభావం

📰 Generate e-Paper Clip

హవానా:అర్జున్ సమాచారం:
కరీబియన్‌ సముద్రంలోని ద్వీప సమూహ దేశం క్యూబాలో అధికారంలో ఉన్న సామ్యవాద వ్యవస్థ గత కొన్ని దశాబ్దాలుగా దేశ ప్రజలకు ఉచిత విద్య, ఆరోగ్య సంరక్షణ, రాయితీతో కూడిన ఆహారం,
అత్యధికులకు ప్రభుత్వరంగ ఉపాధి అందిస్తూ వచ్చింది. బియ్యం, బీన్స్, పాలపొడి, చికెన్, వంటనూనె, గుడ్ల వంటి ఆహార దిగుమతులపై గతంలో ఏటా 2 బిలియన్‌ డాలర్లకు (రూ.18,855 కోట్లు) పైగా
ఖర్చు చేసేది. దాదాపుగా 99 శాతం అక్షరాస్యత ఉన్న ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు ఓ మోస్తరుగా ఉన్నా, కనీస అవసరాలకు ఇబ్బంది పడేవారు కాదు. ఇప్పుడు అదంతా గత చరిత్ర. సుమారు కోటీ
10 లక్షల జనాభా గల నేటి క్యూబాను సుదీర్ఘకాలంగా ఆర్థికసంక్షోభం పీడిస్తోంది. అమెరికా ఇంధన ఆంక్షలు, పెరిగిన ద్రవ్యోల్బణం, తరుగుతున్న ప్రభుత్వ వనరులు క్యూబన్ల జీవితాలను తలకిందులు
చేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ఇంధన ఆంక్షలు ఈ ద్వీప జనజీవనాన్ని దారుణంగా దెబ్బతీశాయి. ఒకప్పుడు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పర్యాటకరంగం తీవ్రంగా క్షీణించింది. రాజధాని నగరం
హవానాలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ఆహార పంపిణీ కేంద్రం వద్ద వందలాదిగా జనం బారులు తీరుతున్నారు. ఉదయాన్నే ఏడింటికి తలుపులు తెరిచే ఈ కేంద్రంలో పంపిణీ చేసే ఆహారం కోసం
కొంతమంది ప్లాస్టిక్‌ బొచ్చెలతో రాత్రే అక్కడికి చేరుకొని రోడ్డు మీద పడుకొంటున్నారు. ‘‘మేము చాలా గడ్డు రోజులు గడుపుతున్నాం’’ అని ఈ కేంద్రానికి వచ్చిన రిటైర్డ్‌ సెక్యూరిటీ గార్డు ఫెర్నాండో
ఫెర్నాండెజ్‌ (71) తెలిపారు. ‘‘వీరు పంపిణీ చేసే ఆహారంతో నా బిడ్డలకు కనీసం ఒక్కపూటైనా కడుపు నిండుతుంది’’ అని అయిదుగురు పిల్లల తల్లి మర్లీస్‌ పాన్స్‌ (34) చెప్పారు. క్యూబాలో
అక్కడక్కడా స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్న ఇటువంటి సామాజిక వంటశాలలే అభద్రతా భావంతో ఉన్న స్థానికులకు జీవనాధారంగా మారాయి. పలు ధార్మిక సంఘాలు, అంతర్జాతీయ సంస్థలు,
ఐక్యరాజ్య సమితి ఈ కేంద్రాల ద్వారా ప్రజల ఆకలిని తీరుస్తున్నాయి. ఈ కిచెన్లలో పెద్ద సైజు కడాయిలు పెట్టి అన్నం, గుడ్లు, పాస్తా.. అప్పుడప్పుడు కొద్దిపాటిగా చికెన్‌ వండుతున్నారు. బాటిళ్లలో చాక్లెట్‌
పాలను నింపుతున్నారు.
====================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!