గోనెగండ్ల,అర్జున్ సమాచారం:
గోనెగండ్ల పట్టణంలో ఒక చిన్నారిపై వీధికుక్క దాడి చేసి గాయపరిచిన ఘటనపై ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తక్షణమే స్పందించారు. ఘటన వివరాలు తెలిసిన వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పట్టణంలోని నివాస ప్రాంతాలు, ప్రధాన వీధులు, బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్న ప్రమాదకరమైన వీధికుక్కలను గుర్తించి, వాటిని పట్టుకుని తరలించేలా వెంటనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సంబంధిత శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రజల ప్రాణాలు, ముఖ్యంగా చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వీధికుక్కల నియంత్రణ కోసం అవసరమైన అన్ని చర్యలను వేగవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా, కుక్క కాటుకు గురైన చిన్నారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని స్థానిక వైద్య అధికారులను ఆదేశించారు. చికిత్సలో ఎలాంటి ఆలస్యం జరగకుండా అవసరమైన మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచడంతో పాటు బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
ప్రజల భద్రతే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని, ఇలాంటి ఘటనలపై వెంటనే స్పందిస్తూ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు.
============================
