కరీంనగర్,అర్జున్ సమాచారం:
ఛాతీలో నొప్పి, బిగుతు, మంట, ఒత్తిడి లేదా ఏదో గాలి చిక్కుకున్నట్లుగా అనిపించడం చాలామందిలో కనిపించే సమస్య. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు చాలామంది గ్యాస్ సమస్య లేదా అసిడిటీ అని భావిస్తారు. నిజంగానే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కొన్నిసార్లు ఛాతీ ప్రాంతంలో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అయితే, ప్రతి ఛాతీ నొప్పినీ గ్యాస్ సమస్యగా భావించడం ప్రమాదకరం. గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితులు కూడా కొన్నిసార్లు గ్యాస్, అసిడిటీ లక్షణాలను పోలి ఉంటాయి.
కాబట్టి ఛాతీలో అసౌకర్యం ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏమిటి, ఎలాంటి ఆహారపు అలవాట్లు దీనికి కారణమవుతాయి, ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు వైద్య సహాయం పొందాలి అనే విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఛాతీ నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు.
ఛాతీలో గ్యాస్ సమస్య అంటే ఏమిటి?
గ్యాస్ సమస్య సాధారణంగా కడుపు లేదా పేగుల్లో గాలి, వాయువులు పేరుకుపోవడం వల్ల ఏర్పడుతుంది. ఇవి ఛాతీ ప్రాంతంలో ఒత్తిడి లేదా అసౌకర్యంగా అనిపించవచ్చు. ఛాతీకి, కడుపుకు మధ్య డయాఫ్రాగమ్ అనే కండరం ఉంటుంది. కడుపు ఉబ్బరంగా మారినప్పుడు కొందరికి పై కడుపు భాగంలో ఒత్తిడి, నిండుగా ఉన్న భావన కలగవచ్చు..
మరో ముఖ్యమైన కారణం అసిడిటీ లేదా గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లక్స్ వ్యాధి జిఈ ఆర్ డి ఇందులో కడుపులోని ఆమ్లం ఆహారనాళంలోకి తిరిగి రావడం వల్ల ఛాతీ మధ్యలో మంట, గొంతులో పుల్లటి రుచి, తిన్న తర్వాత అసౌకర్యం కలగవచ్చు.
తేన్పులు వచ్చినప్పుడు లేదా గ్యాస్ బయటకు వెళ్లినప్పుడు కొంత ఉపశమనం కలగవచ్చు. అయితే, ఇలా ఉపశమనం కలిగిందని గుండె సమస్య లేదని నిర్ధారించలేం.
ఛాతీలో గ్యాస్ సమస్య లక్షణాలు:
ఛాతీలో ఒత్తిడి లేదా బరువుగా అనిపించడం. ఛాతీ నిండుగా ఉన్నట్లు లేదా లోపల ఒత్తిడి ఉన్నట్లు అనిపించవచ్చు. అయితే, ఛాతీలో బరువు లేదా ఒత్తిడి గుండె సంబంధిత సమస్యకు కూడా సంకేతం కావచ్చు.
మంట: ఛాతీ మధ్యలో మంటగా అనిపించడం అసిడిటీ లేదా ఆమ్లం ఆహారనాళంలోకి రావడం వల్ల కలగవచ్చు. భోజనం చేసిన తర్వాత లేదా పడుకున్నప్పుడు ఇది ఎక్కువ కావచ్చు.
తేన్పులు రావడం: తరచుగా తేన్పులు రావడం కడుపులోని గాలి బయటకు రావడం వల్ల జరుగుతుంది. త్వరగా తినడం, కూల్‌డ్రింక్స్ తాగడం, నమిలే గమ్ ఉపయోగించడం వల్ల గాలి ఎక్కువగా మింగబడవచ్చు.. డాక్టర్ డి.సి. తిరుపతిరావు తెలిపారు.

