బద్వేలు,అర్జున్ సమాచారం:
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పై భయాందోళనలు వీడాలని యుటిఎఫ్ కడప జిల్లా అధ్యక్షులు మాదన విజయకుమార్ పేర్కొన్నారు.
ఆదివారం ఉదయం బద్వేలు లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టెట్ ఉచిత కోచింగ్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఎన్సీటిఈ మార్గదర్శకాలకు అనుగుణంగా 2028 ఆగస్టు 31 లోపు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులంతా టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాల్సి ఉందని, దీనిపై కొందరు ఉపాధ్యాయులలో ఆందోళన నెలకొని ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యాబోధన ఒకవైపు, కుటుంబ బాధ్యతలు మరొక వైపు చూస్తూ టెట్ పరీక్షకు ప్రిపేర్ కావడం ఇబ్బందికరమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల్లో ఉన్న భయాందోళనలను పోగొట్టేందుకు యుటిఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని తాలూకా కేంద్రాల్లో ఉపాధ్యాయులకు ఉచిత కోచింగ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పాలకవర్గాలు సుప్రీంకోర్టు తీర్పును కారణంగా చూపి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష ఉత్తీర్ణతను తప్పనిసరి చేయడం సహేతుకం కాదన్నారు. బోధనలో అపార అనుభవం ఉన్న ఉపాధ్యాయులను ఇప్పుడు టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాలనడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నించారు. ఉపాధ్యాయులలో నెలకొని ఉన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో చర్చించి విద్యాహక్కు చట్టం 23 (1) కి సవరణ చేపట్టి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఉపశమనం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆలోపు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు స్పెషల్ టెట్ నిర్వహించాలని కోరారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులంతా టెట్ పరీక్ష పై దృష్టి కేంద్రీకరించి, సన్నద్ధతకు సమయం వెచ్చిస్తే పాఠశాలల్లో విద్య బోధన కుంటుపడుతుందని ఆయన పేర్కొన్నారు. యుటిఎఫ్ ఒకవైపు టెట్ పరీక్ష రద్దుకు పోరాటాలు చేస్తూనే మరోవైపు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం ద్వారా టెట్ ఉత్తీర్ణత పొందేందుకు కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. టెట్ ఉత్తీర్ణతపై ఉపాధ్యాయులెవరూ ఆందోళనకు గురికావలసిన అవసరం లేదని, ఉపాధ్యాయులు టెట్ పాస్ అయ్యేందుకు అవసరమైన కృషిని యుటిఎఫ్ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. టెట్ పరీక్ష సులభంగా పాస్ అయ్యేందుకు యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నామ మాత్రపు ఖరీదుతో పుస్తకాలు రూపొందించి అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలో పేరెన్నికగన్న నిపుణులైన ఫ్యాకల్టీతో కోచింగ్ నిర్వహిస్తున్నామన్నారు. అవకాశాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగపరుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
తరగతులలో టెట్ బోధకులు బి.మస్తాన్ ఖాన్ ట్రై మెథడ్స్ బోధించారు. బోధనా పద్ధతుల్లోని విధానాలను విశ్లేషణాత్మకంగా వివరించారు. టెట్ ఉత్తీర్ణత సాధించేందుకు అవసరమైన విధానాలను సులభరీతిలో బోధించారు.
ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కె.సుధాకర్, ఐక్య ఉపాధ్యాయ జిల్లా కన్వీనర్ టి.శివ ప్రసాద్, అకడమిక్ సెల్ జిల్లా కన్వీనర్ వీరదాసరి క్రిస్టఫర్, సిపిఎస్ జిల్లా కన్వీనర్ ఎన్.పవన్ కుమార్, బద్వేలు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.దేవానందం, సి.కంచిరెడ్డి, ట్రెజరర్ ఎ.లాజరస్, గోపవరం మండల అధ్యక్షులు ఎస్.మస్తాన్ వలి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పాలా శ్రీనివాసుల రెడ్డి, సి.హెచ్ సాగర్, తదితరులు పాల్గొన్నారు.
==========================
