హైదరాబాద్,అర్జున్ సమాచారం:
అక్టోబర్ 9న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆర్టీసీ కార్మిక లోకం స్వచ్ఛందంగా పాల్గొనాలి మంత్రి పొన్నం ప్రభాకర్.
గత ప్రభుత్వ హయాంలో కాలరాసిన ఆర్టీసీ కార్మిక సంఘాల హక్కులను ప్రజాపాలన ప్రభుత్వం తిరిగి పునరుద్ధరిస్తోందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
దాదాపు దశాబ్దం తర్వాత తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరగబోతున్నాయని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాల చివరి గుర్తింపు ఎన్నికలు 2016 జూలై 19న జరిగాయని, ఆ తర్వాత ఎన్నికలకు అవకాశం లేకుండా పోయిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు కీలక పాత్ర పోషించాయని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ కోసం పోరాడిన అదే కార్మిక సంఘాల హక్కులను గత ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేసిందని విమర్శించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడిందని అన్నారు.
కార్మిక సంఘాలకు ప్రజాస్వామ్యబద్ధంగా గుర్తింపు కల్పించే ఎన్నికలు జరగకుండా గత ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని మంత్రి ఆరోపించారు. కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం కార్మిక సంఘాల గుర్తింపు ప్రక్రియను కొనసాగించకుండా కార్మికుల గొంతు నొక్కే ప్రయత్నం జరిగిందన్నారు.
ప్రజాపాలనలో ఆర్టీసీకి పునర్జీవం:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి సంబంధించిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని మంత్రి తెలిపారు. కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు వారి హక్కులను కూడా పునరుద్ధరిస్తున్నామని చెప్పారు.
తాజాగా కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, అక్టోబర్ 9న ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. కార్మిక సోదరులందరూ స్వచ్ఛందంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు.
=============================

