ePaper
Thursday, November 5, 2026
ePaper
Homeతెలంగాణభద్రాద్రిపండగ వేళ ఇష్టారాజ్యంగా రేట్లు.. నాటు బాంబుల విక్రయాలు జోరు...? - పట్టణంలో గుట్టుచప్పుడు...

పండగ వేళ ఇష్టారాజ్యంగా రేట్లు.. నాటు బాంబుల విక్రయాలు జోరు…? – పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా నాటు బాంబుల తయారీ..? – ప్రాణాలతో చెలగాటమాడుతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

📰 Generate e-Paper Clip

కొత్తగూడెం,అర్జున్ సమాచారం:
దీపావళి పండగ సమీపిస్తున్న వేళ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా,  పట్టణంలో నాటు బాంబుల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా నాటు బాంబుల తయారీ సైతం సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకుండా లోగుట్టు మౌనం వహిస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
నిబంధనలకు తూట్లు.. ఇష్టానుసారంగా రేట్లు
ఇక పండగ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఎమ్మార్పీ (MRP) ధరలతో సంబంధం లేకుండా, ఇష్టారీతిన ధరలను పెంచి విక్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న ఈ టపాసులపై అధికారుల నిఘా కరువవడంతో వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు.
కేవలం సాధారణ టపాసుల విక్రయాలకే పరిమితం కాకుండా, పట్టణ శివారు ప్రాంతాల్లో ప్రమాదకరమైన నాటు బాంబుల తయారీ కూడా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఎలాంటి రక్షణ కవచాలు,  గతంలోనూ ఇలాంటి అక్రమ తయారీ కేంద్రాల్లో జరిగిన ప్రమాదాల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నప్పటికీ, యంత్రాంగంలో మాత్రం చలనం రావడం లేదు. ఏ క్షణంలో ఏ ముప్పు ముంచుకొస్తుందోనని స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాటు బాంబుల తయారీ యథేచ్ఛగా సాగుతున్నా.. సంబంధిత రెవెన్యూ, పోలీసు, ఫైర్ శాఖల అధికారులు స్పందించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మామూళ్ల మత్తులో అధికారులు జోగుతున్నారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఏదైనా భారీ ప్రమాదం జరిగి, ప్రాణ నష్టం జరిగితేనే కానీ అధికారులు కళ్ళు తెరవరా? అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌
ప్రాణాపాయ పరిస్థితులకు దారితీసే ఈ అక్రమ బాంబుల వ్యాపారాన్ని, నాటు బాంబుల తయారీని వెంటనే అరికట్టాలని స్థానిక ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరిపే దుకాణాలపై, అక్రమ తయారీ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
=============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!