ePaper
Sunday, August 30, 2026
ePaper
Homeజాతియంయూపీలో హై బీపీ....

యూపీలో హై బీపీ….

📰 Generate e-Paper Clip

లక్నో,అర్జున్ సమాచారం:
దేశ రాజకీయాలకు దిక్సూచి లాంటి ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ  ఆధిపత్యం క్రమంగా సవాలును ఎదుర్కొంటోందన్న చర్చ అంతటా ఊపందుకుంది. 2017, 2022 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో తిరుగులేని జయభేరి మోగించిన బీజేపీకి.. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు షాక్ ఇచ్చారు. అక్కడితో ఆగలేదని  యూపీలో కమలదళం గ్రాఫ్ ఇంకా కిందకే జారుతోందని, ప్రతిపక్ష ఇండియా కూటమి ఊపందుకుంటోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  దీంతో 2027లో జరగబోయే అసెంబ్లీ సమరంలో బీజేపీకి హ్యాట్రిక్ విజయం సులభం కాదనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.యూపీలో బీజేపీకి ప్రధానమైన ప్లస్ పాయింట్ యోగీ ఆదిత్యనాథ్ బుల్డోజర్ మార్కు  పాలన, పటిష్టమైన శాంతిభద్రతలు,  కేంద్ర-రాష్ట్ర సంక్షేమ పథకాలు. అయితే దశాబ్దకాలపు ప్రభుత్వ వ్యతిరేకత , యువతలో పెరుగుతున్న నిరుద్యోగిత, పేపర్ లీకేజీల నిరసనలు,  ద్రవ్యోల్బణం క్షేత్రస్థాయిలో ఓటర్లలో అసంతృప్తిని పెంచుతున్నాయి. వీటికితోడు ఓటర్లలో కనిపించే అలసట, స్థానిక నాయకులపై అసంతృప్తి పార్టీ స్థానాలు పడిపోవడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. కేవలం మతపరమైన ధ్రువీకరణ లేదా నరేంద్ర మోదీ-యోగీ ఆదిత్యనాథ్‌ల ఇమేజ్‌పైనే ఆధారపడటం యూపీలో ఇక వర్కవుట్ కాదనేది క్షేత్రస్థాయి ఓటర్లు ఇస్తున్న స్పష్టమైన సంకేతంగా కనిపిస్తోంది. మరోవైపు, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రూపకల్పన చేసిన పిడిఏ వ్యూహం అంటే వెనుకబడిన తరగతులు, దళితులు, అల్పసంఖ్యాక వర్గాలు  సోషల్ ఇంజనీరింగ్ వ్యూహం యూపీలో అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. గతంలో కేవలం యాదవ్-ముస్లిం సమీకరణలకే పరిమితమైన ఎస్పీ, ఇప్పుడు నాన్-యాదవ్ ఓబీసీలు, నాన్-జాతవ్ దళిత వర్గాలను తమవైపు తిప్పుకోవడంలో విజయం సాధించింది. కాంగ్రెస్‌తో జతకట్టి  ఇండియా  కూటమిగా పోటీచేస్తుండటంతో ఓట్లు చీలిపోకుండా ప్రతిపక్షం అత్యంత బలంగా నిలబడగలుగుతోంది. ఇక బీజేపీ అంతర్గత విభేదాలు, సమాజ్‌వాదీ పార్టీ బలపడటమే కాకుండా.. కుల గణన డిమాండ్లు, స్థానిక బీసీ నేతల అసంతృప్తి కమలనాథులను వేధిస్తున్నాయి.అయితే బీజేపీని తేలికగా తీసిపారేయడానికి వీల్లేదు. ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయి నెట్‌వర్క్, బీజేపీ ఓటు బ్యాంకు మేనేజ్‌మెంట్ , ముఖ్యమంత్రిగా యోగీ ఆదిత్యనాథ్‌కు ఇప్పటికీ ఉన్న వ్యక్తిగత క్రేజ్  ఆ పార్టీకి అతిపెద్ద అడ్వాంటేజ్. యూపీలో బీజేపీ పరిస్థితి పూర్తిగా దిగజారకపోయినా, ఒకప్పటి ఏకపక్ష విజయాల శకం మాత్రం ముగిసిపోయింది. 2027 అసెంబ్లీ ఎన్నికల నాటికి నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, బీసీ వర్గాల ఆందోళనలను పరిష్కరించి.. నష్టనివారణ చర్యలు చేపట్టకపోతే యూపీ పీఠాన్ని కాపాడుకోవడం బీజేపీకి అత్యంత కఠినమైన సవాలుగా మారనుందన్నది ఎక్కువ మంది అభిప్రాయం.
===================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!