రేణిగుంట ,అర్జున్ సమాచారం :
తిరుపతి జిల్లా రేణిగుంట స్థానిక పట్టణంలో సంచలనం సృష్టించిన రైల్వే ఉద్యోగి కిల్లి రవి ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఎస్. ఉషారాణి (35)ను రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం… కిల్లి రవి ఆత్మహత్య చేసుకున్న తర్వాత రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్, పోస్ట్‌మార్టం నివేదిక, సేకరించిన కీలక ఆధారాలు మరియు సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా తిరుపతిలోని మంగళం ప్రాంతానికి చెందిన ఎస్. ఉషారాణిని ఈ కేసులో ముద్దాయిగా నిర్ధారించారు.
కరకంబాడి బస్టాండ్ సమీపంలో అరెస్ట్:
రేణిగుంట మండలం కరకంబాడి బస్టాండ్ సమీపంలో నిందితురాలు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు, రేణిగుంట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వై . శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
“నిందితురాలిని చట్టప్రకారం అరెస్టు చేసి, విచారణలో భాగంగా ఆమె నుండి కేసునకు సంబంధించిన పలు వివరాలను సేకరించాము. చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ ఆమెను గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరుస్తాము. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.”
