అర్జున్ సమాచారం:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా లడ్డూ కౌంటర్ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో కోతులు గుంపులుగా సంచరిస్తుండటంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భక్తులు చేతుల్లో తీసుకెళ్లే ప్రసాదాలు, ఆహార పదార్థాలను కోతులు లాక్కుంటుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు కోతుల సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు.
మహిళపై కోతుల దాడి.. మూడు కుట్లు
సుమారు 20 రోజుల క్రితం అమ్మవారి మెట్ల సమీపంలో ఓ మహిళపై కోతులు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆమెకు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందించి మూడు కుట్లు వేసినట్లు తెలిసింది. ఈ ఘటన భక్తుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.
ఈవో, సీఎస్ఓ అధికారులు స్పందించాలి!
ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలివచ్చే శ్రీశైలం క్షేత్రంలో కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత దేవస్థానం అధికారులపై ఉంది.
దేవస్థానం ఈవో సీఎస్ఓ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
=======================

