హైదరాబాద్: అర్జున్ సమాచారం:
నగరంలో భారీ నకిలీ కరెన్సీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏకంగా రూ.6.78 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుని, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నలుగురిని అరెస్టు చేశారు.
మడుపోజు కర్ణాకర్, చిన్నోళ్ల మాణిక్య రెడ్డి, చెరుకుపెల్లి రత్నాకర్ రెడ్డి, కరణ అజయ్ కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు
చెందిన మరో ముగ్గురు పరారీలో ఉండటంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నవంబర్ 1న అందిన పక్కా సమాచారంతో అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. రామోజీ ఫిల్మ్ సిటీ
సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపి తనిఖీ చేయగా, అందులో రూ.8 లక్షల విలువైన నకిలీ నోట్లు బయటపడ్డాయి. కారులో నకిలీ పోలీసు గుర్తింపు కార్డులు, బొమ్మ తుపాకీ,
హ్యాండ్గన్లు, నాలుగు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా హైదరాబాద్ సమీపంలోని కుంత్లూరులో నకిలీ నోట్ల తయారీ కేంద్రం నిర్వహిస్తున్నట్లు
వెల్లడైంది. దీంతో అక్కడ తనిఖీలు చేపట్టిన పోలీసులు మరో రూ.6.70 కోట్ల విలువైన నకిలీ నోట్లను గుర్తించారు. నోట్ల తయారీకి ఉపయోగిస్తున్న ప్రింటర్లు, ల్యాప్టాప్, లామినేషన్ మెషీన్, పేపర్ కటింగ్
మెషీన్ తదితర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఈ ముఠా నకిలీ నోట్ల తయారీ కోసం యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియాను ఆశ్రయించినట్లు వెల్లడైంది. అసలు నోట్లను
స్కాన్ చేసి, కంప్యూటర్లో మార్పులు చేసి నకిలీ నోట్లను ముద్రించినట్లు పోలీసులు గుర్తించారు. మొదట నకిలీ నోట్లను నేరుగా మార్కెట్లో చలామణి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు. దీంతో
ప్రజలను మోసం చేసేందుకు కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. తక్కువ ధరకు ఎక్కువ మొత్తంలో నకిలీ నోట్లు ఇస్తామని ఆశ చూపుతూ వ్యక్తులను సంప్రదించేవారు. నమ్మకం కలిగించేందుకు మొదట అసలు
నోట్లను చూపించి, ఆ తర్వాత డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడేవారు. ఈ మోసాలకు పోలీసుల పేరును కూడా ఉపయోగించుకున్నారు. నకిలీ నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాల్లో తిరుగుతూ, తాము
పోలీసు అధికారులమని నమ్మించేందుకు నకిలీ గుర్తింపు కార్డులు, మైక్రోఫోన్లు, బొమ్మ తుపాకులను వినియోగించేవారు. నకిలీ నోట్లు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారిని పోలీసులమంటూ బెదిరించి, వారి
వద్ద ఉన్న డబ్బును దోచుకుని పరారయ్యేవారు. అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు, షాద్నగర్ స్పెషల్ ఆపరేషన్స్ బృందం సంయుక్తంగా ఈ ముఠాను పట్టుకున్నాయి. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం
గాలింపు కొనసాగుతోందని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. ఈ నకిలీ కరెన్సీ తయారీ, మోసాల వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
హైదరాబాద్లో భారీ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు – రూ.6.78 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం.. నలుగురి అరెస్టు
RELATED ARTICLES

