ప్రభుత్వ బియ్యం అక్రమ తరలింపుపై రైస్‌మిల్లర్‌పై పీడీ యాక్ట్.రూ.15.70 కోట్ల విలువైన ప్రభుత్వ బియ్యం దారి మళ్లించినట్లు ఆరోపణలు.
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 14:
ప్రభుత్వానికి అందించాల్సిన కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని అక్రమంగా దారి మళ్లించి, బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించి ఆర్థిక లాభాలు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్‌మిల్లర్ గంప సంతోష్‌కుమార్‌పై పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. బ్లాక్‌మార్కెటింగ్ నిరోధక, నిత్యావసర వస్తువుల సరఫరా పరిరక్షణ చట్టం–1980లోని సెక్షన్ 3(1), 3(2) కింద ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్‌ఐ రాజవర్ధన్ లక్షెట్టిపేట సబ్‌జైలులో ఉన్న నిందితుడికి జైలు అధికారుల సమక్షంలో ఉత్తర్వులు అందజేసి అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. గంప సంతోష్‌కుమార్ దండేపల్లి మండలం లింగాపూర్‌లోని ఎం/ఎస్ రామలక్ష్మణ్ ఇండస్ట్రీస్ రైస్‌మిల్ మేనేజింగ్ పార్ట్‌నర్‌గా ఉన్నారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న కస్టమ్ మిల్లింగ్ ఒప్పందాల ప్రకారం రబీ 2022–23, రబీ 2024–25 సీజన్లలో మొత్తం 9,244.206 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ కోసం పొందారు. ఈ ధాన్యానికి సంబంధించి ప్రభుత్వానికి 6,286.059 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ అందించాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,833.511 మెట్రిక్ టన్నులు మాత్రమే అందించినట్లు అధికారులు గుర్తించారు. ఇంకా 4,452.548 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అందించాల్సి ఉండగా, దానికి సమానమైన సుమారు 6,170.643 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దారి మళ్లించినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఈ అక్రమాల వల్ల ప్రభుత్వానికి రూ.15.14 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొన్నారు. గత సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ బకాయిలను కలుపుకుని మొత్తం నష్టం రూ.15,70,36,726గా నిర్ధారించినట్లు తెలిపారు. గంప సంతోష్‌కుమార్‌పై ప్రభుత్వ ధాన్యం దారి మళ్లింపునకు సంబంధించి 2025, 2026 సంవత్సరాల్లో మరో రెండు కేసులు దండేపల్లి, హాజీపూర్ పోలీస్‌స్టేషన్లలో నమోదైనట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా దారి మళ్లించడం వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు. సీఎంఆర్ సరఫరాలో కొరత ఏర్పడితే పేదలు, అర్హులైన లబ్ధిదారులకు సబ్సిడీ బియ్యం అందించే వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. గతంలోనూ నిందితుడిపై కేసులు నమోదైనప్పటికీ అక్రమ కార్యకలాపాలు కొనసాగించారని, సాధారణ చట్టపరమైన చర్యలు నిరోధక ప్రభావం చూపలేదని తెలిపారు. ప్రస్తుతం దండేపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితుడు రిమాండ్‌లో ఉన్నారని, బెయిల్‌పై విడుదలైతే మళ్లీ ఇదే తరహా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు నివేదించిన నేపథ్యంలో పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు సీపీ వెల్లడించారు. ప్రభుత్వానికి చెందిన నిత్యావసర వస్తువులను అక్రమంగా దారి మళ్లించి బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని రామగుండం పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

