అటవీ శాఖలో 43 మంది ఉద్యోగులు టీఎన్జీవో సభ్యత్వం స్వీకరణ….
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాం: టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి…
అర్జున్ సమాచారం // నవంబర్ 19 // మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల: టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఉద్యోగుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా మంచిర్యాలలోని అటవీ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న 43 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవో సంఘంలో సభ్యత్వం స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో సంఘం ఎల్లప్పుడూ ముందుండి కృషి చేస్తుందని తెలిపారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించడం సంఘం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యోగులందరూ సంఘటితంగా ఉండటం ద్వారా సమస్యల పరిష్కారానికి మరింత బలంగా కృషి చేయవచ్చని అన్నారు.
మంచిర్యాల జిల్లాలో ఇంకా సభ్యత్వ నమోదు పూర్తికాని మిగిలిన యూనిట్లలోనూ త్వరితగతిన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నాయకులకు సూచించారు. రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా సభ్యత్వ నమోదులో మొదటి స్థానంలో నిలవడంతోపాటు, సంఘటిత ఉద్యోగుల శక్తితో రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ లక్ష్య సాధనకు ప్రతి ఉద్యోగి సహకరించాలని కోరారు.
అటవీ శాఖలో పనిచేస్తున్న 43 మంది ఉద్యోగులు ఒకేసారి సభ్యత్వం స్వీకరించడం పట్ల టీఎన్జీవో నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం, సంఘం బలోపేతం దిశగా సమిష్టిగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, ఉపాధ్యక్షులు ప్రకాష్‌తో పాటు అటవీ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

