ePaper
Wednesday, August 26, 2026
ePaper
Homeజగిత్యాలరీ–సర్వేను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలి జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

రీ–సర్వేను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలి జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

📰 Generate e-Paper Clip

జగిత్యాల,అర్జున్ సమాచారం:

జగిత్యాల జిల్లాలో చేపట్టిన గ్రామాల రీ–సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వ మార్గదర్శకాలు, నిర్దేశిత కార్యాచరణ ప్రకారం అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలోని తహసీల్దార్లు, గిర్దావర్లు, గ్రామ పాలనాధికారులకు (GPOs) గ్రామాల రీ–సర్వే ప్రక్రియపై సమగ్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రీ–సర్వే ద్వారా గ్రామాల్లోని ప్రతి భూ కమతాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఖచ్చితంగా కొలిచి, భూ రికార్డులను నవీకరించడం జరుగుతుందని తెలిపారు. భూ యజమానుల హక్కుల పరిరక్షణతో పాటు భవిష్యత్తులో భూ వివాదాలను నివారించడమే రీ–సర్వే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రీ–సర్వే ప్రారంభానికి ముందు గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించి, భూ యజమానులు, పట్టాదారులు, రైతులు, ప్రజాప్రతినిధులకు సర్వే కార్యక్రమంపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ సరిహద్దులు, ప్రభుత్వ భూములు, అటవీ భూములు, చెరువులు, కుంటలు, వాగులు, రహదారులు, శ్మశానవాటికలు, ప్రజా అవసరాలకు కేటాయించిన భూములు తదితర సామూహిక ఆస్తులను స్పష్టంగా గుర్తించి రికార్డు చేయాలని ఆదేశించారు.
సర్వే సమయంలో రెవెన్యూ రికార్డులు, పాత గ్రామ పటాలు, సేత్వార్, టిప్పన్, ఖాస్రా పహాణి, ప్రస్తుత భూ రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలు మరియు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను సమగ్రంగా పరిశీలించాలని తెలిపారు. పాత సర్వే నంబర్లు, కొత్త భూ కమతాల మధ్య సంబంధాన్ని తెలియజేసే కోరిలేషన్ స్టేట్‌మెంట్, ఫీల్డ్ రిజిస్టర్, ల్యాండ్ పార్సిల్ మ్యాప్, గ్రామ పటం తదితర రికార్డులను ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా రూపొందించాలని సూచించారు. భూ కమతాల కొలతలు పూర్తయిన అనంతరం సంబంధిత భూ యజమానులకు నోటీసులు జారీ చేసి, వారి సమక్షంలో హద్దులను నిర్ధారించాలని తెలిపారు. అభ్యంతరాలు, క్లెయిమ్‌లు వచ్చినప్పుడు వాటిని నిర్ణీత గడువులో స్వీకరించి, రికార్డులు మరియు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన తర్వాత నిష్పక్షపాతంగా పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామ పాలనాధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి, సర్వే బృందాలకు అవసరమైన భూ రికార్డులు, స్థానిక సమాచారం అందించాలని సూచించారు. గిర్దావర్లు రోజువారీ సర్వే పనులను పర్యవేక్షించాలని, తహసీల్దార్లు మండల స్థాయిలో మొత్తం ప్రక్రియను సమన్వయం చేస్తూ పురోగతిని నిరంతరం సమీక్షించాలని తెలిపారు.
రీ–సర్వే అనేది కేవలం భూములను కొలిచే కార్యక్రమం మాత్రమే కాదని, గ్రామంలోని ప్రతి అంగుళం భూమికి సంబంధించిన సమగ్రమైన, శాశ్వతమైన మరియు విశ్వసనీయమైన రికార్డును రూపొందించే కీలక కార్యక్రమమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేసి రీ–సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. శిక్షణ కార్యక్రమంలో రీ–సర్వేకు సంబంధించిన ముందస్తు కార్యక్రమాలు, గ్రామ సరిహద్దుల నిర్ధారణ, గ్రౌండ్ ట్రూతింగ్, భూ కమతాల కొలత, మ్యాపుల తయారీ, రికార్డుల పరిశీలన, ఫారాలు–రిజిస్టర్ల నిర్వహణ, అభ్యంతరాల పరిష్కారం, తుది భూ రికార్డుల రూపకల్పన తదితర అంశాలను అధికారులకు సవివరంగా వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో బి.ఎస్. లత అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) , సంబంధిత జిల్లా అధికారులు, రెవెన్యూ మరియు సర్వే–ల్యాండ్ రికార్డుల శాఖ అధికారులు, తహసీల్దార్లు, గిర్దావర్లు, గ్రామ పాలనాధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!