ePaper
Saturday, August 29, 2026
ePaper
Homeతెలంగాణభద్రాద్రిసింగరేణిలో తగ్గుతున్న కార్మికుల సంఖ్య.. వెలవెలబోతున్న కార్మికవాడలు కొత్త నియామకాలు లేక, గనుల...

సింగరేణిలో తగ్గుతున్న కార్మికుల సంఖ్య.. వెలవెలబోతున్న కార్మికవాడలు కొత్త నియామకాలు లేక, గనుల మూతతో ప్రశ్నార్థకంగా మారుతున్న ఏరియాల భవిష్యత్

📰 Generate e-Paper Clip

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 27,అర్జున్ సమాచారం:
ఒకప్పుడు బొగ్గు గనులు, వేలాది మంది కార్మిక కుటుంబాలతో కళకళలాడిన సింగరేణి ప్రాంతాలు నేడు కార్మికుల కొరతతో వెలవెలబోతున్నాయి. ఓ వైపు బొగ్గు గనులు క్రమంగా మూతపడుతుండగా.. మరోవైపు సింగరేణి యాజమాన్యం కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో కార్మికవాడలు బోసిపోతున్నాయి. గనుల మూతతో ఇంతకాలం పనిచేసిన కార్మికులు ఇతర ప్రాంతాలకు తరలిపోతుండటంతో పలు ఏరియాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకప్పుడు సింగరేణిలో ఉద్యోగం అంటేనే భయపడే పరిస్థితి ఉండేది. బొగ్గు గనుల్లో పనిచేయడానికి చాలామంది వెనుకంజ వేసేవారు. అయితే కాలక్రమంలో సింగరేణి సంస్థ వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించే సంస్థగా రూపాంతరం చెందింది. బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు అప్పటి డైరెక్టర్‌ జీపీ రావు నేతృత్వంలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టారు. ఆ సమయంలో కార్మికుల ఎంపికలో పరుగు పందెం వంటి పోటీలు నిర్వహించడంతోపాటు, అంతకుముందు బరువులు ఎత్తే సామర్థ్యం ఆధారంగా కూడా ఉద్యోగాలు కల్పించేవారు. 1985 ప్రాంతంలో రన్నింగ్‌ ద్వారా ఒకేసారి సుమారు 40 వేల మందిని నియమించిన సందర్భం ఉంది. దీంతో సింగరేణిలో కార్మికుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే కాలక్రమంలో బొగ్గు ఉత్పత్తి పెరిగినప్పటికీ కార్మికుల సంఖ్య మాత్రం క్రమంగా తగ్గుతూ వచ్చింది. సంస్థలో అవసరానికి మించి కార్మికులు ఉన్నారనే కారణంతో యాజమాన్యం వివిధ పద్ధతుల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించే చర్యలు చేపట్టింది. గోల్డెన్‌ షేక్‌హ్యాండ్‌ పథకం ద్వారా సర్వీసు పూర్తికాకముందే పలువురు కార్మికులు ఉద్యోగాల నుంచి వైదొలిగే పరిస్థితి ఏర్పడింది. దీంతో సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఒకప్పుడు లక్షకు పైగా కార్మికులు పనిచేసిన సింగరేణి సంస్థలో ప్రస్తుతం ఆ సంఖ్య సుమారు 40 వేలకు చేరుకుంది. అన్ని ఏరియాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గత ఐదేళ్లలో కార్మికుల సంఖ్య ఎన్నడూ లేనంత వేగంగా తగ్గినప్పటికీ కొత్త నియామకాలపై యాజమాన్యం పెద్దగా దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త నియామకాలు లేకపోవడం, సీనియర్‌ కార్మికులు పదవీ విరమణ చేయడం, కొన్ని గనులు మూతపడటం వంటి పరిణామాలతో కార్మికుల సంఖ్య మరింత తగ్గుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో సింగరేణి ప్రాంతాల్లోని అనేక కార్మికవాడలు పూర్తిగా వెలవెలబోయే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ ప్రాంత పరిధిలోని సింగరేణి శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లోనూ కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఐదేళ్ల క్రితం ఈ మూడు ఏరియాల్లో కలిపి సుమారు 21 వేల మంది వరకు కార్మికులు ఉండగా.. ప్రస్తుతం 14 వేల మందికి పైగా మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాబోయే ఐదేళ్లలో మరిన్ని గనులు మూతపడితే కార్మికుల సంఖ్య మరింత తగ్గిపోయే అవకాశం ఉంది. కొత్త నియామకాలు చేపట్టకపోతే అనుభవజ్ఞులైన కార్మికుల స్థానంలో కొత్త తరం సిబ్బంది లేకపోవడం సంస్థ భవిష్యత్‌ నిర్వహణపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గనులు నడిచిన కాలంలో కార్మిక కుటుంబాలతో కళకళలాడిన సింగరేణి కాలనీల్లో ప్రస్తుతం జనసంచారం తగ్గుతోంది. గనులు మూతపడటం, ఉద్యోగులు ఇతర ప్రాంతాలకు తరలిపోవడం, కొత్త నియామకాలు లేకపోవడంతో పాఠశాలలు, మార్కెట్లు, చిన్న వ్యాపారాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలపైనా ప్రభావం పడుతోంది. సింగరేణి సంస్థకు కొత్త గనులు, కొత్త ఉపాధి అవకాశాలు, అవసరమైన చోట కొత్త నియామకాలు చేపట్టడంతోపాటు మూతపడుతున్న గనుల ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను కల్పించాల్సిన అవసరం ఉందని కార్మికులు, స్థానికులు కోరుతున్నారు. లేకపోతే ఒకప్పుడు కార్మికుల కష్టంతో వెలుగొందిన సింగరేణి ప్రాంతాలు భవిష్యత్తులో క్రమంగా జనరహిత ప్రాంతాలుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది
=============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!