కుమురం భీమ్ ఆసిఫాబాద్, ఆగస్టు 27,అర్జున్ సమాచారం:
: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ శ్రీమతి కే. హరిత సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, వసతి గృహ విద్యార్థులకు వివిధ ప్రోత్సాహకాలు, నిత్యావసర మరియు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. విద్యార్థులు మొక్కల సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని అధికారులు సూచించారు.
కలెక్టర్ విద్యార్థులు, వసతి గృహ బోర్డర్లతో ఆప్యాయంగా ముచ్చటించి వారి విద్యాభ్యాసం, చదువులో ప్రతిభ, పాఠశాల మరియు వసతి గృహ సౌకర్యాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, భోజనం, రోజువారీ సమస్యలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీసిన కలెక్టర్, విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధికి అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ యూనిఫాంలు, బెడ్షీట్లు, కార్పెట్లు, షూస్, ప్లేట్లు, గ్లాసులు, కిట్ బ్యాగులు తదితర విద్యా మరియు వసతి గృహ అవసరాలకు సంబంధించిన సామగ్రిని పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్,జాదవ్ అంబాజీ డీఆర్డీఏ పీడీ,బానోత్ దత్తారం ఏసీఎంఓ, పూర్కా ఉద్దవ్ ఏటీడీఓ,చిరంజీవి డీఎస్ఓ,మాడావి శేఖు జీసీడీఓ కొట్నాక్ శకుంతల తదితర అధికారులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, చంద్రశేఖర్ వార్డెన్, ఉపాధ్యాయులు, సిబ్బంది కార్యక్రమంలో చురుకుగా పాల్గొని కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించారు.
విద్యార్థులతో జిల్లా కలెక్టర్ నేరుగా ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకోవడం, వారికి అవసరమైన సామగ్రిని పంపిణీ చేయడం పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
===================

