అవగాహన పెంచుకుందాం.. ఐక్యంగా ముందుకు సాగుదాం .కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు: పుట్ట మధుకర్, మిరియాల రాజిరెడ్డి.
అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 25. రామగిరి డెస్క్.
కార్మిక చట్టాలపై మరింత అవగాహన పెంచుకుని, కార్మికుల సంక్షేమం కోసం ఐక్యంగా నిరంతరం కృషి చేయడం ద్వారా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని (టీబీజీకేఎస్) మరింత బలోపేతం చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు.
శుక్రవారం సెంటినరీ కాలనీలోని సాయిరాం గార్డెన్లో ఆర్జీ-3 ఏపీ డివిజన్ టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు నాగెళ్లి సాంబయ్య ఆధ్వర్యంలో సెంట్రల్, డివిజన్ కమిటీల ముఖ్య నాయకులకు కార్మికుల సమస్యలు, హక్కులు, సంక్షేమం, కొత్త లేబర్ కోడ్లపై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్ నిర్వహించారు.
కార్యక్రమానికి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ పింగిలి సంపత్‌రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. సింగరేణి మాజీ పర్సనల్ అధికారి ముప్పిడి రవీందర్‌రెడ్డి కార్మిక చట్టాలు, సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై నాయకులకు శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా పుట్ట మధుకర్, మిరియాల రాజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వాలు కానీ, గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు కానీ కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సంఘాలు కార్మికులను మోసం చేశాయని వారు విమర్శించారు.
సింగరేణి సంస్థకు రావాల్సిన విద్యుత్ బకాయిలు రూ.52 వేల కోట్లకు పైగా పేరుకుపోయాయని వారు ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, సింగరేణిని పరిరక్షించేందుకు కార్మికుల పక్షాన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సింగరేణిని ఆర్థిక వనరుగా ఉపయోగించుకుంటూ సంస్థ నిధులను ఇతర కార్యక్రమాలకు ఖర్చు చేస్తోందని వారు విమర్శించారు.
ఎన్నికల సమయంలో నెలకు మూడు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని హామీ ఇచ్చినా, మూడేళ్లలో 300 మందిని కూడా అన్‌ఫిట్ చేయలేకపోయారని వారు ఆరోపించారు. డివిజన్లో కార్మికుల చిన్నచిన్న సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదని, కార్మిక వాడల్లో రోడ్లు, డ్రైనేజీల పరిస్థితి సరిగా లేదని పేర్కొన్నారు. 150 మాస్టర్ లేకపోతే డిస్మిస్ చేయడం ద్వారా కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ద్వారా 16 వేల మందికి పైగా సీనియర్ కార్మికులకు మెడికల్ అన్‌ఫిట్ చేసి వారి పిల్లలకు ఉద్యోగాలు కల్పించినట్లు పుట్ట మధుకర్, మిరియాల రాజిరెడ్డి పేర్కొన్నారు. కార్మికులు అడగకపోయినా ఒక శాతం విద్యుత్ చార్జీల రికవరీని పూర్తిగా రద్దు చేసి ఏసీ సౌకర్యం కల్పించిన ఘనత టీబీజీకేఎస్‌కే దక్కుతుందని వారు పేర్కొన్నారు.
అనేక అండర్‌గ్రౌండ్ గనులు, ఓపెన్‌కాస్ట్ గనులను ప్రారంభించడంతో పాటు ఉన్న గనుల విస్తరణకు అనుమతులు తీసుకువచ్చినట్లు తెలిపారు. కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్య సేవలు అందించడంతో పాటు ఆర్థిక సహాయం అందించినట్లు వివరించారు.
ప్రస్తుత గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో కార్మిక నాయకత్వం మరింత ఐక్యంగా, చైతన్యంగా సమస్యలపై పోరాటం చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నిరంతర పోరాటం కొనసాగించాలని, కార్మిక సమస్యలపై రాజీలేని పోరాటానికి తమ నాయకత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఆర్జీ-3లో టీబీజీకేఎస్‌ను బలోపేతం చేసేందుకు కార్మికులు, కార్యకర్తలను సమీకరించి చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రామగిరి మండల శాఖ అధ్యక్షుడు శంకేష్ రవీందర్, కమాన్‌పూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ, రామగిరి మాజీ జెడ్పీటీసీ సభ్యులు శారదకుమార్, పట్టణ అధ్యక్షుడు కాపురబోయిన భాస్కర్‌తో పాటు సెంట్రల్ కమిటీ, డివిజన్ కమిటీ నాయకులు, ఓసీ-1, ఓసీ-2, ఏఎల్పీ, సీహెచ్‌పీ, ఎస్అండ్పీసీ పిట్ సెక్రటరీలు, అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు, సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

