జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ,ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్.
అర్జున్ సమాచారం // అక్టోబర్ 2 // మంథని డెస్క్
జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రకటించిన పథకాలను వెంటనే అమలు చేయాలని మంథని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్ డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంథనిలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా అంకరి కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఎలాంటి షరతులు లేకుండా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, జర్నలిస్టుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు.
జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని, మంథని ప్రెస్ క్లబ్ శాశ్వత భవనానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వర్కింగ్ జర్నలిస్టులకు బస్సు పాస్, టోల్‌ఫీజు మినహాయింపు, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు.
అనంతరం జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్‌కు మరో వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పోతరాజు సమ్మయ్య, కోశాధికారి తగరం రాజు, సహాయ కార్యదర్శి గంధం అంజిబాబు, సీనియర్ జర్నలిస్టు కొమురోజు చంద్రమోహన్, లక్కాకుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

