రెండు విడతల కరువు భత్యం విడుదలకు ఆమోదం.. ఉద్యోగ సంఘాల హర్షం! ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి
అర్జున్ సమాచారం. అక్టోబర్ 02. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
-మంచిర్యాల: ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రెండు విడతల కరువు భత్యం విడుదలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై టీఎన్జీవో మంచిర్యాల జిల్లా సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి శాసనసభ్యుడు గడ్డం వినోద్ వెంకటస్వామి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు.
శుక్రవారం మంచిర్యాల టీఎన్జీవో భవన్‌లో గడియారం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు సంద అశోక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల ఐక్య పోరాట ఫలితంగా రెండు విడతల కరువు భత్యం విడుదలకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు. సుమారు 210 ఉద్యోగ సంఘాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఐక్య ఉద్యమానికి బలమైన నాయకత్వం అందించిన ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు, టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్, ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు కృషిని ప్రత్యేకంగా అభినందించారు. క్షేత్రస్థాయిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వారు చేసిన కృషి అభినందనీయమని తెలిపారు.
ప్రభుత్వం రెండు విడతల కరువు భత్యం విడుదలకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో మిగిలిన ఉద్యోగుల సమస్యలను సైతం వెంటనే పరిష్కరించాలని శ్రీహరి కోరారు. ముఖ్యంగా వేతన సవరణ సంఘం నివేదికను తెప్పించి 51 శాతం ఫిట్‌మెంట్‌తో నూతన వేతన సవరణ అమలు చేయాలని, మిగిలిన పెండింగ్ కరువు భత్యాన్ని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు అన్ని బిల్లులు మంజూరు చేసి ఉపశమనం కల్పించాలని కోరారు.

