గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి ,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, దేవాదాయ) శైలజ రామయ్యర్.
అర్జున్ సమాచారం. అక్టోబర్ 03. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల జిల్లా: 3, 2026:రాష్ట్రంలో గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, దేవాదాయ) శైలజ రామయ్యర్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి అధికారులతో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా గోదావరి నది తీరం గల జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో గోదావరి పుష్కర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో గోదావరి నది తీరంలో జరగనున్న పుష్కరాల సంబంధిత ఏర్పాట్లపై అధికారులు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు, వైద్య శిబిరాల ఏర్పాటు, గజ ఈతగాళ్ల ఏర్పాటు, బందోబస్తు ఇతర పూర్తి స్థాయి సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు.జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య మాట్లాడుతూ జిల్లాలో గోదావరి పుష్కరాలు ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా జరిపేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని మంచిర్యాల, గూడెం, లక్షెట్టిపేట, వేలాల, చెన్నూర్ ప్రాంతాలలో పుష్కర ఘాట్ల ఏర్పాటు పనులపై పర్యవేక్షించడంతో పాటు రహదారులు, వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలం, ఇతర ఏర్పాట్లను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. పుష్కర స్నానం కోసం సమీప జిల్లాల నుండి కాకుండా అనేక ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు హాజరు అయ్యే అవకాశం ఉందని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

