ePaper
Sunday, October 4, 2026
ePaper
Homeతెలంగాణసమాజ సేవను బాధ్యతగా భావించాలి. నెలకు 100 మంది కార్మికులకు అండగా నిలుస్తున్న సింగరేణి యువబలగం...

సమాజ సేవను బాధ్యతగా భావించాలి. నెలకు 100 మంది కార్మికులకు అండగా నిలుస్తున్న సింగరేణి యువబలగం అభినందనీయం.నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ.. మెగా రక్తదాన శిబిరం.

📰 Generate e-Paper Clip

సమాజ సేవను బాధ్యతగా భావించాలి. నెలకు 100 మంది కార్మికులకు అండగా నిలుస్తున్న సింగరేణి యువబలగం అభినందనీయం.నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ.. మెగా రక్తదాన శిబిరం.

అర్జున్ సమాచారం // అక్టోబర్ 3 // రామగిరి రిపోర్టర్.

‘‘ఆపదలో అండ.. సేవే మా గుణం.. ఐక్యతే మా ఆభరణం’’ అనే నినాదంతో రామగుండం రీజియన్‌లో సింగరేణి యువ కార్మికులు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని ఆర్జీ-3, ఏపీఏ ఏరియా జనరల్ మేనేజర్లు సుంకర మధుసూదన్, కొలిపాక నాగేశ్వరరావు అన్నారు. కార్మికులు విధి నిర్వహణతో పాటు సామాజిక బాధ్యతలను నిర్వర్తించడం అభినందనీయమని పేర్కొన్నారు.

శనివారం రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో సింగరేణి యువబలగం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని జీఎంలు మధుసూదన్, నాగేశ్వరరావు ప్రారంభించారు. కార్యక్రమానికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ఐఈడీ డీజీఎం మురళీకృష్ణ, ఏజీఎం బండి సత్యనారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

130 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు

సింగరేణి యువబలగం సభ్యులు గత మూడు సంవత్సరాలుగా పేదలు, నిరుపేద కుటుంబాలు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జీఎంలు తెలిపారు. ఇప్పటివరకు 130 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమన్నారు.

రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురికి అవసరాన్ని బట్టి నగదు, వస్తు రూపంలో సహాయం చేయడం ఆదర్శనీయమన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం, ఖాళీ ప్రదేశాల్లో సీడ్ బాల్స్ వేయడం, రక్తదాతల వివరాలను సేకరించి అత్యవసర సమయాల్లో రక్తం అందేలా చర్యలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.

మృతుడి జ్ఞాపకార్థం సరుకుల పంపిణీ

ఓసీ-1లో ఈపీ ఆపరేటర్‌గా పనిచేసి అనారోగ్యంతో మృతి చెందిన నరసింహుల వీరారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు ముత్తారం మండల కేంద్రంలోని ముగ్గురు నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందించారు.

జీఎంలు మధుసూదన్, నాగేశ్వరరావు, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, అధికారులు, నాయకులతో కలిసి ముగ్గురు నిరుపేద మహిళలకు సరుకులు అందజేశారు. సమాజంలోని పేదలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని వారు సూచించారు.

150 మందికి పైగా రక్తదానం

థలసేమియా బాధితులు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, డయాలసిస్ రోగులకు అవసరమైన రక్తాన్ని అందించాలనే ఉద్దేశంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి యువ కార్మికులు, ఇతరులు కలిపి 150 మందికి పైగా హాజరై రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడేందుకు సహాయపడినట్లవుతుందని అన్నారు. యువత పెద్ద సంఖ్యలో రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.

సింగరేణి యువబలగం చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఒకరిద్దరి కృషితో కాకుండా సభ్యులందరి సహకారం, ఐక్యతతోనే విజయవంతంగా కొనసాగుతున్నాయని నాయకులు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ సేవా కార్యక్రమాలకు సింగరేణి అధికారులు, నాయకుల తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ ఎం.ఆర్.సి. రెడ్డి, రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ పి.వి. రావు, ఐఎన్టీయూసీ నాయకులు రామారావు, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ షఫ్రూద్దీన్, ఎస్‌ఐ స్వామి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు కాసర్ల శ్రీనివాస్, డాక్టర్ ప్రేమ్ సాయి, సూపర్‌వైజర్ మాధవి తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి యువబలగం సభ్యులు పాశం శ్రీనివాస్ రెడ్డి, వీరగోని సంతోష్ గౌడ్, బోయినపల్లి శ్రీకాంత్ రావు, బుడిగే క్రాంతి కుమార్, మాదారపు కేశవరావు, గుజ్జుల రాజశేఖర్ రెడ్డి, మల్లోరి నికేష్ రెడ్డి, గాండ్ల సతీష్, గండి శ్రీనివాస్, మండ సురేష్, వంశీనాథ్, జగన్నాథం రవి, వేముల శ్రీకాంత్, పూజారి కిరణ్, వాసాల రామాంజనేయులు, బీరం సంజీవ్, అనవేని సంజీవ్, అట్టే బాబు జోసెఫ్, వేగోళం శ్రీనివాస్, పరిషవేణి సమ్మయ్య, మహేష్, సందీ శ్రీనివాస్ రెడ్డి, రవి, సూర్యప్రకాష్, కట్ల సంతోష్, మేకల రమేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!