విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతులు:
భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం, అక్టోబర్ 8:
భీమారం మండల కేంద్రంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు గురువారం నిర్వహించిన భారీ రాస్తారోకోతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.
మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు, ఆవడం ఎక్స్-రోడ్డు నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించి కరెంట్ కోతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.
మంచిర్యాల జిల్లాబిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ బాల్క సుమన్ ఆదేశాల మేరకు భీమారం మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ ఆందోళన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. రైతుల పక్షాన నిలిచి పోరాటం చేసిన నాయకులు.. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏఈ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అనంతరం డివిజనల్ ఇంజనీర్ తో ఫోన్లో సంప్రదించి, ప్రస్తుతం సరఫరా చేస్తున్న కరెంట్‌కు అదనంగా మరో 4 గంటల విద్యుత్‌ను అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారుల నుంచి హామీ లభించడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు. దీంతో జాతీయ రహదారిపై రవాణా సాధారణ స్థితికి చేరుకుంది.

