ప్రారంభానికి నోచుకోని ఆరోగ్య ఉప కేంద్రం!ప్రజలకు అందని వైద్య సేవలు..
అర్జున్ సమాచారం | అక్టోబర్ 11 | బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని కాసిపేట గ్రామపంచాయతీ పరిధిలో లక్షలాది రూపాయలతో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రం రెండేళ్లు గడిచినా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో గ్రామీణ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందకుండా పోతున్నాయి.
గోడలకు పగుళ్లు.. చుట్టూ పిచ్చి మొక్కలు.
ప్రారంభం కాకముందే ఆరోగ్య ఉప కేంద్రం భవనం గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. భవనం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా మారింది. ప్రజలకు ఉపయోగపడాల్సిన విలువైన బాడీ ఫ్రిజర్ కూడా మూలకు పడిపోయింది. ఇది ఎవరి నిర్లక్ష్యం? ప్రజా ప్రతినిధులదా? అధికారులదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించడం, గర్భిణులకు వైద్య సేవలు, చిన్నారులకు టీకాలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంలో ఆరోగ్య ఉప కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కాసిపేటలో ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభం కాకపోవడంతో ప్రజలు వైద్య సేవల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి ఆరోగ్య ఉప కేంద్రాన్ని వెంటనే ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచి, గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వివిధ రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు ఆరోగ్య ఉప కేంద్రాన్ని పరిశీలించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ సంబంధిత ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి, కాసిపేట గ్రామపంచాయతీ ప్రజలకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సాంకె రవి, సీపీఐ (ఎంఎల్) మంచిర్యాల జిల్లా కార్యదర్శి, కొడప అనంతరావు, రాయిసెంటర్ మేటి ఆదివాసీ నాయకుడు, శిలోజు మురళి, సిరాజ్ ఖాన్, సామాజిక కార్యకర్తలు, మెండ్రపు రాజయ్య, ఉప సర్పంచ్, బుగ్గగూడెం, నిచ్చకొల్ల శంకర్, వార్డు మెంబర్, సోదారి సురేష్, టీఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జి, భూక్యా తిరుపతి నాయక్, కాంగ్రెస్ యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

