ePaper
Wednesday, October 14, 2026
ePaper
Homeతెలంగాణసింగరేణి సంస్థను కాపాడుకునేందుకే బీఆర్‌ఎస్‌ పోరాటం.కేసీఆర్‌ హయాంలో గ్లోబల్‌ సంస్థగా మార్చే ప్రయత్నం.. కాంగ్రెస్‌ పాలనలో...

సింగరేణి సంస్థను కాపాడుకునేందుకే బీఆర్‌ఎస్‌ పోరాటం.కేసీఆర్‌ హయాంలో గ్లోబల్‌ సంస్థగా మార్చే ప్రయత్నం.. కాంగ్రెస్‌ పాలనలో జేబు సంస్థగా మారుస్తున్నారు.

📰 Generate e-Paper Clip

సింగరేణి సంస్థను కాపాడుకునేందుకే బీఆర్‌ఎస్‌ పోరాటం.కేసీఆర్‌ హయాంలో గ్లోబల్‌ సంస్థగా మార్చే ప్రయత్నం.. కాంగ్రెస్‌ పాలనలో జేబు సంస్థగా మారుస్తున్నారు.

కార్మికుల ప్రయోజనాల కోసమే సింగరేణి కార్మిక గర్జన,మాజీ ఎంపీ, మాజీ ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌.

అర్జున్ సమాచారం: అక్టోబర్ 11:మంథని డెస్క్.

సింగరేణి సంస్థను, ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడుకోవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తోందని మాజీ ఎంపీ, మాజీ ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. ఆదివారం మంథని పట్టణంలోని రాజగృహలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కలిసి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తున్నారని బాల్క సుమన్‌ ఆరోపించారు. సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వాటాలో 10 నుంచి 15 శాతం వరకు విక్రయించే అంశంపై తెరవెనుక చర్చలు జరుగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే సంస్థను నష్టాల దిశగా నడిపిస్తోందని ఆయన ఆరోపించారు.

సింగరేణిని విస్తరించాలన్నదే కేసీఆర్‌ లక్ష్యం

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థను మరింత విస్తరించి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నాలు చేశారని బాల్క సుమన్‌ గుర్తుచేశారు. సంస్థను ఇతర రాష్ట్రాలకు విస్తరించే అవకాశాలను పరిశీలించేందుకు సీఎండీని వివిధ దేశాలకు పంపించినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం సంస్థను తన సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని విమర్శించారు.

సింగరేణిలో వాటాల విక్రయం అంశంపై ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు స్పందించాలని ఆయన కోరారు. ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు సంస్థ భవిష్యత్తుపై ఎందుకు మాట్లాడటం లేదో ప్రజలు ఆలోచించాలని వ్యాఖ్యానించారు.

కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

కార్మికుల సంక్షేమాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరించిందని బాల్క సుమన్‌ విమర్శించారు. కార్మికులకు మెడికల్‌ బోర్డులు నిర్వహించడంలో నిర్లక్ష్యం జరుగుతోందని, వైద్య పరీక్షల కోసం వెళ్లిన కార్మికులను వెనక్కి పంపిస్తున్నారని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జీవో 76 కింద సుమారు 30 వేల కుటుంబాలకు ఇంటి స్థలాలు అందించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో కార్మికులకు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత లేదని అన్నారు.

సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా కల్పించిన ఘనత గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని పేర్కొంటూ, ప్రస్తుతం లాభాల వాటా విషయంలో కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కార్మికులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా కార్మికులను మోసం చేసిందని విమర్శించారు.

ఈ నెల 14న కార్మిక గర్జన

సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం, పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14న రామగుండంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్య అతిథిగా సింగరేణి కార్మిక గర్జన బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బాల్క సుమన్‌ తెలిపారు. ఈ సభ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కార్మికులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని చెప్పారు.

సింగరేణి సంస్థ పరిరక్షణతోపాటు కార్మికుల ప్రయోజనాల సాధన కోసం నిర్వహిస్తున్న కార్మిక గర్జనకు కార్మికులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బాల్క సుమన్‌ పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!