ePaper
Friday, October 16, 2026
ePaper
Homeఆరోగ్యంఈ నెల 22 నుంచి ఇంటింటా కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే,మంచిర్యాల జిల్లాలో 650 బృందాలతో...

ఈ నెల 22 నుంచి ఇంటింటా కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే,మంచిర్యాల జిల్లాలో 650 బృందాలతో విస్తృత తనిఖీలు

📰 Generate e-Paper Clip

ఈ నెల 22 నుంచి ఇంటింటా కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే,మంచిర్యాల జిల్లాలో 650 బృందాలతో విస్తృత తనిఖీలు

చర్మంపై స్పర్శలేని మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి: రాష్ట్ర పరిశీలకురాలు డాక్టర్‌ విజయనిర్మల

అర్జున్ సమాచారం // అక్టోబర్ 15 // స్టాఫ్ రిపోర్టర్ // మంచిర్యాల జిల్లా:

జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లావ్యాప్తంగా ఈ నెల 22 నుంచి నవంబర్‌ 4 వరకు ఇంటింటా కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 650 బృందాలను ఏర్పాటు చేసి, ప్రజల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించనున్నారు. సర్వేకు ప్రజలు సహకరించి, వ్యాధి లక్షణాలు ఉన్నవారు ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్ర పరిశీలకురాలు డాక్టర్‌ విజయనిర్మల కోరారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాట్ల పరిశీలన

సర్వే నిర్వహణకు చేపట్టిన ముందస్తు ఏర్పాట్లను పరిశీలించేందుకు డాక్టర్‌ విజయనిర్మల తాండూరు, మందమర్రి, తాళ్లగురజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. వైద్యులు, సిబ్బందితో సమావేశమై సర్వే ప్రణాళిక, క్షేత్రస్థాయి సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌తో కలిసి సర్వే కార్యాచరణను సమీక్షించారు. కుష్ఠు వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రూపొందించిన గోడపత్రికలు, కరపత్రాలను విడుదల చేశారు.

జిల్లాలో 59 కుష్ఠు వ్యాధి కేసుల గుర్తింపు

జిల్లాలో ఇప్పటివరకు 59 కుష్ఠు వ్యాధి కేసులను గుర్తించి బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా అంగవైకల్యం వంటి సమస్యలను నివారించవచ్చని తెలిపారు. ఇంటింటా నిర్వహించే సర్వేలో భాగంగా ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి వ్యాధి లక్షణాలపై వివరాలు సేకరించనున్నారు.

మచ్చలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు

కుష్ఠు వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదని, మైకోబ్యాక్టీరియం లెప్రే అనే సూక్ష్మక్రిమి వల్ల సంక్రమిస్తుందని డాక్టర్‌ విజయనిర్మల వివరించారు. చర్మంపై ఎరుపు, గోధుమ లేదా పాలిపోయిన రంగులో మచ్చలు ఏర్పడి, ఆ ప్రాంతంలో స్పర్శ జ్ఞానం తగ్గడం లేదా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.

కుష్ఠు వ్యాధికి బహుళ ఔషధ చికిత్స (ఎండీటీ) అందుబాటులో ఉందని, వైద్యుల సూచనల మేరకు పూర్తిస్థాయిలో చికిత్స తీసుకుంటే వ్యాధిని నయం చేయవచ్చని తెలిపారు. వ్యాధిపై అపోహలు వీడి, లక్షణాలు ఉన్నవారు ముందుగానే పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

సర్వేకు ప్రజలు సహకరించాలి

ఈ నెల 22 నుంచి నవంబర్‌ 4 వరకు నిర్వహించే సర్వేలో ఆరోగ్య సిబ్బందికి అవసరమైన సమాచారం అందించి సహకరించాలని అధికారులు ప్రజలను కోరారు. వ్యాధిని తొలిదశలో గుర్తించడం, బాధితులకు సకాలంలో చికిత్స అందించడం, వ్యాధి వ్యాప్తిని నియంత్రించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుధాకర్‌ నాయక్‌, వైద్యులు డాక్టర్‌ ఝాన్సీ, డాక్టర్‌ లక్ష్మి, జిల్లా ప్రజారోగ్య సమాచార అధికారి బుక్క వెంకటేశ్వర్‌, పుట్ట సత్తయ్య, నాందేవ్‌ శ్రీనివాస్‌, అల్లాడి శ్రీనివాస్‌, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!