యాసంగి వరి సాగుపై రైతులకు స్పష్టమైన భరోసా కల్పించాలి.
రైతులకు ప్రత్యామ్నాయ జీవనోపాధిపై ప్రభుత్వం ముందుగానే ప్రకటన చేయాలి,
ముత్తారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోతుపెద్ది కిషన్ రెడ్డి డిమాండ్.
అర్జున్ సమాచారం // అక్టోబర్ 16 // ముత్తారం రిపోర్టర్
యాసంగి సీజన్లో వరి సాగు చేయవద్దని సూచిస్తున్న ప్రభుత్వం.. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర వర్గాలకు ఎలాంటి భరోసా కల్పిస్తుందో ముందుగానే స్పష్టంగా ప్రకటించాలని ముత్తారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోతుపెద్ది కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఏ పంటలు సాగు చేయాలి, వాటికి మార్కెటింగ్ సౌకర్యాలు ఎలా కల్పిస్తారు, రైతులకు ఎలాంటి ఆర్థిక సహాయం అందిస్తారనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావుపై వర్షాలు కురవకుండా క్షుద్ర పూజలు చేశారంటూ కొందరు మంత్రులు ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం దేవుడి దయతో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని, పంటల సాగుకు సరిపడా నీరు అందుబాటులో ఉందని ప్రకటించిన నాయకులు.. ఇప్పుడు ఎల్నినో ప్రభావాన్ని ప్రస్తావిస్తూ యాసంగిలో వరి సాగు చేయవద్దని చెప్పడం రైతుల్లో గందరగోళం సృష్టిస్తోందని విమర్శించారు.
ప్రత్యామ్నాయ పంటలపై స్పష్టత ఏదీ?
రైతులు ఏ పంట సాగు చేయాలనే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు. వరి సాగును తగ్గించాలని సూచిస్తే, అందుకు ప్రత్యామ్నాయంగా ఏ పంటలు సాగు చేయాలి, వాటికి అవసరమైన విత్తనాలు, సాగునీరు, పెట్టుబడి సాయం, గిట్టుబాటు ధర, కొనుగోలు సౌకర్యాలు ఎలా కల్పిస్తారో వివరించాలని అన్నారు. కేవలం వరి సాగు చేయవద్దని సూచించడం వల్ల రైతుల సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలు
వ్యవసాయం కేవలం రైతులకే పరిమితం కాదని, వ్యవసాయ కూలీలు, హమాలీలు, ధాన్యం వ్యాపారులు, రవాణా కార్మికులు, ఎరువులు, విత్తనాల వ్యాపారులు సహా అనేక వర్గాల జీవనోపాధి వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉందని తెలిపారు. వరి సాగు తగ్గితే ఈ వర్గాల ఆదాయంపై ఎలాంటి ప్రభావం పడుతుంది, వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

