పదేళ్లు గడిచినా రామగిరి మండలానికి అభివృద్ధి ఏది?
రామగిరి మండలం:అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 30.
16 గ్రామపంచాయతీలు.. 40 వేల ఓట్లు.. 60 వేల జనాభా.. అయినా సొంత ప్రభుత్వ భవనాలకు నోచుకోని మండలం – సింగరేణి సీఎస్‌ఆర్, డీఎంఎఫ్ నిధులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయా?
సింగరేణి యాజమాన్యం ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలి – మొలుమూరి శ్రీనివాస్ డిమాండ్.
రామగిరి మండలం ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదని, సుమారు 40 వేల ఓట్లు, 60 వేల మంది జనాభా కలిగిన మండలానికి ఇప్పటికీ పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రాకపోవడం ఆవేదన కలిగిస్తోందని బీజేపీ ఎంపీటీసీల ఫోరం పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థకు సమీపంలో ఉన్న మండలంలోని గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదని, సింగరేణి సీఎస్‌ఆర్, డీఎంఎఫ్ నిధులు స్థానిక ప్రాంతాల అభివృద్ధికి ఎంతవరకు
వినియోగిస్తున్నారనే అంశంపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ మేరకు రామగిరిలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. మండలంలో మొత్తం 16 గ్రామపంచాయతీలు ఉన్నాయని, వీటిలో పలు గ్రామాలు సింగరేణి ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన సొంత భవనాలు నిర్మించకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలోనూ, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనూ రామగిరి మండల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. పదేళ్లు గడిచినా మండల ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించకపోవడం బాధాకరమన్నారు.
ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు ఎక్కడ?
రామగిరి మండలానికి తక్షణమే నూతన మండల ప్రజాపరిషత్ కార్యాలయ భవనం నిర్మించాలని ఆయన కోరారు. తహసీల్దార్ కార్యాలయం, మండల రెవెన్యూ కార్యాలయానికి శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా ఆధునిక గ్రంథాలయ భవనంతోపాటు నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే పోలీస్ స్టేషన్‌కు సొంత భవనం నిర్మించడంతోపాటు పోలీసు సిబ్బంది కోసం క్వార్టర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేసి, అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖలకు ప్రత్యేక కార్యాలయాలు నిర్మించాలని, మహిళా సంఘాల కార్యకలాపాలకు అనువైన భవనం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
ప్రజా సమావేశాలు, అధికారిక కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా సమావేశ మందిరం నిర్మించాలని, ఇతర అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. మండలంలోని విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు సింగరేణి పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణ అందించేలా జూనియర్ కళాశాల, ఐటీఐ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

