ePaper
Friday, October 30, 2026
ePaper
Homeఎడిటోరియల్రాజకీయ మనుగడగా  నిత్యావసరాలు.

రాజకీయ మనుగడగా  నిత్యావసరాలు.

📰 Generate e-Paper Clip


రాజకీయ మనుగడగా  నిత్యావసరాలు.

(విశ్లేషణ). అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 30.

రాజకీయాల్లో ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రగిలేందుకు పెద్ద పెద్ద  సమస్యలో లేదా సిద్ధాంతపరమైన విభేదాలో అవసరం లేదు.  సగటు సామాన్యుడి రోజువారీ కిచెన్ బడ్జెట్ తలకిందులైతే చాలు! కడుపు నిండా తినే కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటినప్పుడు, ప్రజల్లో వ్యక్తమయ్యే ఆగ్రహం నేరుగా పాలకపక్షాల గ్రాఫ్‌ను వేగంగా పడదోస్తుంది.  ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిన ఎల్ నినో  తీవ్రత వల్ల ఏర్పడిన అకాల వర్షాలు, పండగల రద్దీ, వాతావరణ మార్పుల ధాటికి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనూ నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ధరల మంట ప్రజావ్యతిరేకతగా మారకముందే అదుపుచేసేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రూ.కోట్ల ఆర్థిక భారాన్ని మోసేందుకు సిద్ధపడుతుండటం ఆసక్తికరమైన రాజకీయ సమీకరణగా మారింది.ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, పెరుగుతున్న ధరల నుంచి సామాన్యుడిని కాపాడేందుకు ప్రత్యేక కౌంటర్లు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ను పూర్తిస్థాయిలో రంగంలోకి దించింది. నెలకు సుమారు రూ. 100 కోట్ల వరకు అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ, బహిరంగ మార్కెట్ ధరల కంటే చాలా తక్కువకే నిత్యావసరాలను అందుబాటులోకి తెస్తోంది. రూ.100కే కిలో కందిపప్పు, రూ.125కే లీటర్ పామాయిల్, రూ.25కే గోధుమపిండి అందించడంతో పాటు, ధరణి  బ్రాండ్ బియ్యాన్ని ప్రత్యేక వాహనాల ద్వారా అందుబాటులోకి తెస్తూ మార్కెట్ ధరలపై ఒత్తిడి పెంచి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.మరోవైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల అసంతృప్తిని చల్లబరిచేందుకు ఏకంగా రేషన్ కార్డుదారులకు  ప్రత్యేక నిత్యావసరాల కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టే దిశగా అడుగులు వేస్తోంది. కేవలం బియ్యం మాత్రమే కాకుండా, పప్పు దినుసులు, వంటనూనెలు, గోధుమపిండి, చక్కెర వంటి 6 రకాల నిత్యావసరాలతో కూడిన సబ్సిడీ కిట్లను అందించడం ద్వారా పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు పౌరసరఫరాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. బహిరంగ మార్కెట్లో ధరలను విచ్చలవిడిగా పెంచే వ్యాపారుల నిర్బంధ తనిఖీలతో పాటు, ప్రభుత్వం నేరుగా ఈ సబ్సిడీ కిట్లను ఇవ్వడం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లో సానుకూలత తెచ్చుకోవాలని భావిస్తోంది.ఆర్థికంగా తీవ్ర లోటు,  రుణభారంతో సతమతమవుతున్నప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ధరల నియంత్ణకై ఇంత భారీగా నిధులు వెచ్చించడానికి ప్రధాన కారణం ఓటు బ్యాంకు ముప్పు! ఉచిత పథకాలు ఎంత అందజేసినా, మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు పెరిగితే సామాన్యుడి పాకెట్ మనీ ఖాళీ అయిపోతుంది. దీనివల్ల ప్రభుత్వాల సంక్షేమ పథకాల ఇంపాక్ట్ సున్నాగా మారి, హామీలు ఇచ్చారు కానీ పొట్ట నింపడం లేదు అనే నిరసన స్వరం గ్రామాల్లో బలంగా వినిపించే ప్రమాదం ఉందనేది పొలిటికల్ సర్వేల హెచ్చరిక. ఈ నిత్యావసరాల ధరల నియంత్రణ అంశం రెండు ప్రభుత్వాలకు సంజీవనిలా మారనుంది. బహిరంగ మార్కెట్ ధరలపై నిరంతరం నిఘా ఉంచడం, లభ్యత కొరత రాకుండా ముందస్తుగా దిగుమతులు చేసుకోవడం ద్వారా ప్రజాసంతోషాన్ని  కాపాడుకోవడమే ఏపీ, తెలంగాణ సీఎంల ప్రధాన అజెండా.జాతీయ, అంతర్జాతీయ వాతావరణ మార్పుల వల్ల ఏర్పడిన నిత్యావసరాల కొరతను కేవలం  పరిపాలనా సమస్య గా చూడకుండా, ‘రాజకీయ మనుగడ’ సమస్యగా భావించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భారాన్ని తమ భుజాన వేసుకోవడం రాజకీయంగా అత్యంత వ్యూహాత్మకమైన అడుగుగా  భావించవచ్చు. ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక సబ్సిడీ ప్రణాళిక ప్రకారం.. మార్కెట్‌లో కిలో రూ.160 నుంచి రూ. 180 వరకు పలుకుతున్న కందిపప్పును కేవలం రూ. 100 కే అందించనున్నారు. అలాగే లీటరు పామాయిల్‌ను రూ. 125 కే, గోధుమపిండిని కిలో రూ. 25 కే పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు క్వాలిటీ బియ్యాన్ని తక్కువ ధరలకే అందించేందుకు ప్రత్యేక మొబైల్ వాహనాలు, రైతు బజార్లను విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. బహిరంగ మార్కెట్‌లో రేట్ల కృత్రిమ కొరతను అరికట్టేందుకు, ఉల్లిపాయల నిల్వలను కూడా నిరంతరం పర్యవేక్షించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.ప్రజా పంపిణీ వ్యవస్థ , రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకు ఈ సరుకులను పంపిణీ చేయడం వల్ల రాష్ట్ర ఖజానాపై నెలకు దాదాపు రూ. 100 కోట్ల మేర అదనపు ఆర్థిక భారం పడుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే, ఎంతటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎల్ నినో వల్ల పెరిగిన ధరల నుంచి సామాన్యులకు ఊరట కల్పించడమే తమ కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పేదల కడుపు నింపే విషయంలో సంక్షేమానికి వెనుకాడేది లేదని తేల్చిచెప్పారు.దీపావళి కానుకగా అందుబాటులోకి రానున్న ఈ పథకం ద్వారా రాష్ట్రంలో కోట్లాది మంది కార్డుదారులు , సామాన్య ప్రజలు నేరుగా లబ్ధి పొందనున్నారు. ఒకవైపు పండుగ సీజన్,మరోవైపు ఎల్ నినో ప్రభావంతో కూరగాయలు, దినుసుల ధరలు మండిపోతున్న తరుణంలో చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం మధ్యతరగతి గృహిణులకు ఎనలేని ఊరటనిస్తోంది. ప్రభుత్వం సకాలంలో స్పందించి చౌక ధరల సరుకులను రేషన్ డిపోల వేదికగా అందుబాటులోకి తేవడంపై పబ్లిక్ సర్కిల్స్‌లో హర్షం వ్యక్తమవుతోంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!