ePaper
Saturday, November 14, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్రబీ సాగులో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల...

రబీ సాగులో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 90 శాతానికి పెంచాలి భూసేకరణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి వీధి కుక్కల నియంత్రణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలు జిల్లా కలెక్టర్లతో సీఎస్ సంజయ్ జాజ్జు వీడియో కాన్ఫరెన్స్

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్:
అర్జున్ సమాచారం:
రబీ 2026-27 సీజన్‌లో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
డా బిఆర్ అంబేడ్కర్ సచివాలయం నుండి శుక్రవారం ప్రత్యామ్నయ పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లు, విద్య, మౌలిక సదుపాయాలు, భూసేకరణ, నీటి సంరక్షణ, వీధి కుక్కల నియంత్రణ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రబీలో ప్రత్యామ్నయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎల్ నినో వల్ల నీటి కొరత ఏర్పడనున్నందున  వరికి బదులుగా ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ సాగుతో పాటు సూక్ష్మ సేద్య పద్ధతులను రైతులు అనుసరించేలా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. రైతు ఐడీ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కొనుగోలు కేంద్రాలను ముందుగానే సిద్ధం చేయాలని, నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రైతులు ప్రైవేటు మార్కెట్లో ధాన్యం విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర అందేలా చూడాలని తెలిపారు.  ప్రభుత్వం నిర్దేశించిన  రకాలకు 500 బోనస్ అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరును ముఖ గుర్తింపు యాప్  ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని, హాజరు శాతాన్ని 90 శాతానికి పైగా పెంచాలని సీఎస్ సూచించారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ వంటి డిజిటల్ విద్యా వేదికలను సమర్థవంతంగా వినియోగించు కోవాలన్నారు.
రూసా 2.0, పీఎం ఉషా, సమగ్ర శిక్ష అభియాన్, పీఎం శ్రీ పథకాల కింద మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకొని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రూ.11 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 87 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు, రూ.1,108 కోట్లతో మంజూరైన 115 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు.
సాగునీటి ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. భూసేకరణకు అవసరమైన నిధుల కొరత లేదని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో వీధి కుక్కలను గుర్తించి, నిబంధనల ప్రకారం పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు భూగర్భ జలాల అభివృద్ధికి అవసరమైన నీటి సంరక్షణ చర్యలు  చేపట్టాలని సూచించారు. కాలువల్లో పూడిక, చెత్త తొలగించి నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాలని, గ్రామస్థాయిలో నీటి సంరక్షణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!