పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేయాలి ,పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలి.
తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జేఏసీ.
హైదరాబాద్: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 16.
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల జేఏసీ డిమాండ్ చేసింది. 2004 నోటిఫికేషన్ ద్వారా నియామకమైన ఉద్యోగులందరికీ ఎలాంటి షరతులు లేకుండా OPS అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరింది,
సోమవారం నాడు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఐకాసా ఛైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రకటించిన రెండు డీఏలతో పాటు మిగిలిన డీఏలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేసారు. పీఆర్సీ కమిటీ నివేదిక తెప్పించుకుని వెంటనే పీఆర్సీ అమలు చేయాలని విజ్ఞప్తి చేసారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, మెడికల్ బిల్లులు వెంటనే చెల్లించాలి. బిల్లుల చెల్లింపుల కోసం గ్రీన్ ఛానల్స్ ఏర్పాటు చేయాలి. ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన ఆర్థిక రాయితీలు వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగుల పదోన్నతులు, రెగ్యులరైజేషన్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేసారు.
జూనియర్ లెక్చరర్లు, పంచాయతీ కార్యదర్శుల పోస్టుల సమస్యలు పరిష్కరించాలి. 317 జీవో ద్వారా ఏర్పడిన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. జీవో 191 అమలులో ఉన్న సమస్యలను తొలగించాలి. జీవో 25ను రద్దు చేసి ఉపాధ్యాయులకు కొత్త విధానం తీసుకురావాలి. ఇంటర్మీడియట్ బోర్డు విలీనం నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఈహెచ్ఎస్ పథకంలోని లోటుపాట్లు సరిచేసి పకడ్బందీగా అమలు చేయాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు

