ePaper
Tuesday, November 24, 2026
ePaper
Homeజాతియం‘సరయూ-కమల ఎక్స్‌ప్రెస్’కు మోదీ, నేపాల్ ప్రధాని పచ్చజెండా

‘సరయూ-కమల ఎక్స్‌ప్రెస్’కు మోదీ, నేపాల్ ప్రధాని పచ్చజెండా

📰 Generate e-Paper Clip

ఢిల్లీ / అయోధ్య, నవంబర్ 23: అర్జున్ సమాచారం:
భారత్-నేపాల్ మధ్య రైల్వే అనుసంధానాన్ని, సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో చారిత్రక అడుగు పడింది. శ్రీరాముడి జన్మస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య, సీతాదేవి
జన్మస్థలమైన నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్‌ లను నేరుగా అనుసంధానించే కొత్త వీక్లీ రైలు ‘సరయూ-కమల ఎక్స్‌ప్రెస్’  ను ఇవాళ (నవంబర్ 23) భారత ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా
ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అయోధ్యలో జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. అయోధ్య కంటోన్మెంట్ నుంచి
జనక్‌పూర్ ధామ్ వరకు సుమారు 604 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు దాదాపు 19 గంటల్లో చేరుకుంటుంది. ప్రయాణికులు మధ్యలో రైలు మారాల్సిన అవసరం లేకుండా నేరుగా గమ్యస్థానానికి
చేరుకోవచ్చు. సోమవారం ఇనాగరేషన్ రన్ జరగనుండగా, నవంబర్ 28 నుంచి సాధారణ ప్రయాణికులకు పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి సోమవారం సాయంత్రం 5:50 గంటలకు
అయోధ్య కంటోన్మెంట్ నుంచి బయలుదేరి, మంగళవారం మధ్యాహ్నం 12:40 గంటలకు (నేపాల్ కాలమానం ప్రకారం) జనక్‌పూర్ ధామ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం
మధ్యాహ్నం 1:10 గంటలకు జనక్‌పూర్ ధామ్ నుంచి బయలుదేరి, ఆదివారం ఉదయం 8:10 గంటలకు అయోధ్యకు చేరుకుంటుంది. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లోని పలు ప్రధాన నగరాలు, పట్టణాల
మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. అయోధ్య ధామ్, మన్కాపూర్, బస్తీ, గోరఖ్‌పూర్, నర్కటియాగంజ్, రక్సౌల్, సీతామర్హి, శిషో, మధుబని, జయనగర్ స్టేషన్లలో దీనికి హాల్ట్‌లు కల్పించారు. మొత్తం 17
ఆధునిక కోచ్‌లతో ఈ రైలు నడుస్తుంది. ఇందులో 8 ఏసీ కోచ్‌లు, 7 స్లీపర్ కోచ్‌లు, దివ్యాంగులకు అనుకూలమైన ఒక లగేజీ కోచ్, పవర్ కార్ ఉంటాయి. ఈ రైలు సౌకర్యం వల్ల ఇరు దేశాల భక్తులు,
పర్యాటకులు రామాయణ సర్క్యూట్‌లోని ప్రధాన పుణ్యక్షేత్రాలను సులభంగా సందర్శించే వీలు కలుగుతుంది. ఉత్తరప్రదేశ్, బిహార్, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లోని స్థానిక వ్యాపారులు, పర్యాటక నిర్వాహకులు,
హస్తకళాకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. విద్య, వ్యాపార, కుటుంబ అవసరాల కోసం సరిహద్దు దాటి ప్రయాణించే ప్రజలకు ఇది ఎంతో సౌకర్యవంతంగా మారనుంది.
=============

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!