దక్షిణ కొరియా: దక్షిణ కొరియా తూర్పు తీరంలో మంగళవారం ఉదయం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. రష్యన్ సైనిక విమానాలు తమ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ (ఏడీఐజడ్)లోకి ప్రవేశించడంతో, దక్షిణ కొరియా వైమానిక దళం తక్షణమే స్పందించి తమ ఫైటర్ జెట్లను రంగంలోకి దించింది. రష్యన్ విమానాలు జోన్‌లోకి ప్రవేశించక ముందే వాటి కదలికలను గుర్తించిన దక్షిణ కొరియా సైన్యం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా తమ ఫైటర్ జెట్ల ద్వారా ‘టాక్టికల్ మాన్యువర్స్’ నిర్వహించింది. కొద్దిసేపటి తర్వాత రష్యన్ విమానాలు ఆ ప్రాంతం నుంచి వెనుదిరిగాయి. అయితే, రష్యన్ విమానాలు దేశ సార్వభౌమ గగనతలంలోకి ప్రవేశించలేదని, కేవలం ఏడీఐజడ్ పరిధిలోనే ఉన్నాయని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (జేసీఎస్) స్పష్టం చేశారు. ఒక దేశ గగనతలంలోకి సమీపించే విమానాలను గుర్తించి, స్పందించేందుకు ఏర్పాటు చేసుకునే ప్రత్యేక జోన్‌నే ఏడీఐజడ్ అంటారు. ఇది సార్వభౌమ గగనతలం కిందికి రాదు. ఈ ఘటన సమయంలో స్వల్ప గందరగోళం కూడా నెలకొంది. మొదట, రష్యన్ విమానం గగనతలంలోకి చొరబడిందనే సమాచారంతో అధికారులు తూర్పు తీరంలోని ఉల్లెంగ్ ద్వీపానికి ఖాళీ చేయాలంటూ హెచ్చరిక జారీ చేశారు. అయితే, కేవలం మూడు నిమిషాల్లోనే అది పొరపాటని గ్రహించి హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ఉత్తర కొరియా విమానం ఉల్లెంగ్ ప్రాంతానికి సమీపంలో ఉందనే తప్పుడు సమాచారంతో స్థానిక ప్రభుత్వం ఈ హెచ్చరిక జారీ చేసినట్లు యోన్‌హాప్ వార్తా సంస్థ నివేదించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, రష్యన్ విమానాలు జోన్ నుంచి పూర్తిగా నిష్క్రమించాయని సైన్యం తెలిపింది. ఈ ఘటనపై రష్యా రక్షణ శాఖ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
====================
రష్యా విమానాల చొరబాటు.. దక్షిణ కొరియాలో వాయుదాడి హెచ్చరిక.. యుద్ధ విమానాల మోహరింపు – దక్షిణ కొరియా సమీపంలోకి రష్యా సైనిక విమానాలు – వెంటనే ఫైటర్ జెట్లను రంగంలోకి దించిన కొరియా వైమానిక దళం – గగనతల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసిన సైన్యం – ఉల్లెంగ్ ద్వీపంలో పొరపాటు హెచ్చరికతో స్వల్ప గందరగోళం
RELATED ARTICLES

