తిరుపతి. అర్జున్ సమాచారం:
అమర రాజా గ్రూప్ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు, గల్లా అరుణ కుమారి దంపతుల మనవడు, అమర రాజా గ్రూప్ ఛైర్మన్ గల్లా జయదేవ్, పద్మావతి గల్లా దంపతుల కుమారుడు
గల్లా సిద్ధార్థ్ వివాహం దక్షిణ కొరియాకు చెందిన హెయిన్ కిమ్‌తో వియత్నాంలోని హుక్కాక్ ద్వీపంలో ఘనంగా జరిగింది.
నవంబర్ 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు వివాహ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, కొరియన్ సంప్రదాయాలు, పాశ్చాత్య వివాహ పద్ధతుల
సమ్మేళనంగా మూడు విభిన్న సంప్రదాయాల్లో ఈ వేడుకలను నిర్వహించడం విశేషం.
మొదటగా భారతీయ హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక నిర్వహించగా, అనంతరం వధువు కుటుంబ సంప్రదాయమైన కొరియన్ పద్ధతిలో ప్రత్యేక వేడుక నిర్వహించారు. అలాగే పాశ్చాత్య
సంప్రదాయం ప్రకారం మరో వేడుకను నిర్వహించారు. ఇలా మూడు విభిన్న పద్ధతుల్లో వివాహ వేడుకలను నిర్వహించడం ద్వారా ఇరు కుటుంబాల సంస్కృతులు, సంప్రదాయాలకు సముచిత
ప్రాధాన్యతనిచ్చారు.
వరుడు దివంగత సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ, దివంగత ఇందిరా దేవి మనవడైన గల్లా సిద్ధార్థ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుకు మేనల్లుడు. ఈ వివాహ వేడుకల్లో గల్లా, ఘట్టమనేని కుటుంబ సభ్యులతో పాటు వధువు కుటుంబ సభ్యులు, ఇరు కుటుంబాలకు చెందిన బంధుమిత్రులు, ఆత్మీయులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
భారతీయ హిందూ సంప్రదాయాలు, కొరియన్ సంస్కృతి, పాశ్చాత్య వివాహ పద్ధతులను మేళవించి మూడు విభిన్న సంప్రదాయాల్లో వివాహ వేడుకలను నిర్వహించడం ఈ వివాహానికి ప్రత్యేక ఆకర్షణగా
నిలిచింది.

