ఏపీ కేజీఎఫ్…జొన్నగిరి
కర్నూలు, జూన్ 29, అర్జున్ సమాచారం
మార్కెట్లోకి ఆంధ్ర బంగారం వచ్చేసింది. మేడిన్ ఆంధ్ర బంగారానికి మార్కెట్లో చోటు దక్కింది. కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి గోల్డ్ మార్కెట్లోకి తీసుకొచ్చారు. జియో మైసూర్ సంస్థ తయారుచేసిన 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాముల బిస్కెట్లు షాపుల్లో కనిపిస్తున్నాయి. ఏపీ మ్యాప్ తో పాటు జొన్నగిరి గోల్డ్ మైన్స్ పేరుతో ముద్రవేశారు. ప్రస్తుతం కర్నూలులోని షరాబు బజారుకు చెందిన కొందరు వ్యాపారుల దగ్గర ఈ బిస్కెట్లు లభిస్తున్నాయి. బంగారం స్వచ్ఛత తెలిసేలా 999 నెంబర్ కూడా ముద్ర వేశారు. 24 క్యారెట్ల స్వచ్ఛత ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం ఈ 500 గ్రాముల బిస్కెట్ విలువ అక్షరాల రూ.75 లక్షలు పై మాటే. జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి ప్రస్తుతానికి 100 కిలోలు మాత్రమే ఉత్పత్తి చేసి విక్రయించినట్లు కర్నూలు బంగారం వ్యాపారులు చెబుతున్నారు.ఇటీవల కర్నూలు జిల్లాలో జొన్నగిరి ప్రాంతంలో దేశంలోనే అతిపెద్దదైన ప్రైవేట్ బంగారు గొనుల ప్రాజెక్టు ఉత్పత్తి మొదలైంది. 405 కోట్ల ఖర్చుతో ఇక్కడ బంగారాన్ని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు. జొన్నగిరి ప్రాంతంలో తయారైన బంగారాన్ని బయటకు విడుదల చేశారు. బ్రాండ్ ఏపీ పేరుతో ఈ బంగారాన్ని విక్రయిస్తున్నారు. రాయల్టీ రూపం లో జొన్నగిరి ద్వారా భారీగానే ఏపీ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.జొన్నగిరి వల్ల కర్నూలు జిల్లా స్వర్ణ గిరిగా మారిపోయింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు మరో కేజీఎఫ్ ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. అది కూడా చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోని గడుపల్లె మండలంలోని చిగురు గుంట ప్రాంతంలో ఉంది.సరిగా 2001లో ఇక్కడ గోల్డ్ మైన్స్ మూతపడ్డాయి. ఇప్పుడు వాటిని తెరిపించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇటీవల ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఇందులో రెండు కంపెనీలు పాల్గొన్నారు. గతంలో 263 హెక్టార్లలో ఇక్కడి గనులు విస్తరించి ఉన్నాయి. తాజాగా నిర్వహించిన సర్వేలో మరో తొమ్మిది హెక్టార్లను ఇందులో కలిపారు. గత ఎడాది ఇక్కడి బంగారు నిక్షేపాలపై అధికారులు సర్వే చేశారు. నివేదిక కూడా అందించారు. ఆ నివేదిక ప్రకారం ఇక్కడ 18 లక్షల టన్నుల ముడి బంగారు ఖనిజం ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.. ఒక టన్ను ముడి ఖనిజం నుంచి దాదాపు 5.5 గ్రాముల బంగారం లభిస్తుంది. ఈ ప్రకారం అక్కడ 8.5 టన్నుల బంగారం ఉండవచ్చని సమాచారం. ఒకవేళ ఈ మైండ్స్ మళ్లీ మొదలయితే 5000 మందికి ఉపాధి లభిస్తుంది.వాస్తవానికి ఈ గని ఇప్పటిది కాదు. దశాబ్దాల క్రితమే ఇక్కడ ముడి ఖనిజాన్ని తవ్వారు. అప్పట్లో గుడిపల్లె మండలంలో రెండు ప్రాంతాలలో గోల్డ్ మైన్స్ ఉన్నాయని గుర్తించారు. బిసానత్తం ప్రాంతంలో 1968, చిగురు గుంటలో 1978లో తవ్వకాలు మొదలుపెట్టారు. నాడు ఎంఈసిఎల్ సంస్థ ఆధ్వర్యంలో తవ్వకాలు ప్రారంభించారు. ఇక్కడ లభించే క్వార్జ్ రాయిని వెలికి తీసి.. విక్రయించడం మొదలుపెట్టారు. ఎంఈసిఎల్ దాదాపు 10 సంవత్సరాలపాటు క్వార్జ్ ను వెలికి తీసింది. నాడు కేజీఎఫ్ లోని భారత్ గోల్డ్ మైనింగ్ లిమిటెడ్ కు అందించింది. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఈ సంస్థ చెప్పుకోవడంతో ఘనుల నిర్వహణ కష్టంగా మారింది. ఆ తర్వాత ఇక్కడి గనులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీజీఎమ్ఎల్ 1982లో విక్రయించింది. 2001 వరకు ఇక్కడ బిజీ ఎంఎల్ సంస్థ ముడి ఖనిజాన్ని వెలికి తీసింది. ఆ తర్వాత అనేక సమస్యలు ఎదురు కావడంతో ఈ గనులను మూసివేస్తూ బిజిఎంఎల్ నిర్ణయం తీసుకుంది. ఈ గనులకు సంబంధించి 263b హెక్టార్ల భూమిని 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేసింది. బంగారం అన్వేషణలో భాగంగా 150 బోర్లు డ్రిల్ చేసింది.త్వరలో పూర్తిస్థాయిలో వినియోగదారుల కోసం మార్కెట్లోకి విడుదల చేస్తామని చెబుతున్నారు. ఈనెల 24న సీఎం ప్రారంభించిన వెంటనే కర్నూలుకు చెందిన బంగారం వ్యాపారులు కామిశెట్టి జగదీష్, చక్రవర్తి, శ్రీహరి మూర్తి తో పాటు పలువురు వ్యాపారులు బంగారాన్ని కొనుగోలు చేశారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగానే ఈ బంగారాన్ని అందుకున్నారు. ఓ వ్యాపారి ఒక గోల్డ్ బిస్కెట్‌ను వినియోగదారులకు విక్రయించినట్లు కూడా చెప్పారు. అయితే ఏపీ బంగారం దేశీయ మార్కెట్లోకి ప్రవేశించడం మాత్రం నిజంగా శుభపరిణామం.జొన్నగిరి గోల్డ్ మైనింగ్ తో విదేశీ మరకద్రవ్యం దేశం దాటిపోదాంటున్నారు వ్యాపారులు. ప్రస్తుతానికి ప్రభుత్వం ఎలాంటి పన్నులు, రాయితీలు లేవు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారానికి ఏ పన్నులు వర్తిస్తాయో.. జొన్నగిరిలో బంగారానికి కూడా వర్తిస్తాయని చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో ఈ గోల్డ్ మైనింగ్ ప్రారంభం కావడంతో.. జువెలరీ క్లస్టర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మార్కెట్లో సందడి
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రంలోనే తవ్వకాల ద్వారా వెలికితీసిన మేలిమి బంగారం మార్కెట్లోకి వచ్చింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గోల్డ్ మైన్‌లో ఉత్పత్తి చేసిన 99శాతం స్వచ్ఛత కలిగిన బంగారు బార్లు ఇప్పుడు కర్నూలు నగరంలోని షరాఫ్ బజార్‌లోని జ్యువెలరీ దుకాణాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సింబల్‌తో రూపొందించిన ఈ బంగారం వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది.2015 నుంచి జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జొన్నగిరిలో బంగారు నిక్షేపాల వెలికితీత కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ బంగారం ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో రాష్ట్రంలోనే తొలిసారిగా ఉత్పత్తి అయిన బంగారం ప్రజలకు అందుబాటులోకి రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రత్నాలసీమగా పేరొందిన కర్నూలు ఇప్పుడు బంగారం ఉత్పత్తికి కూడా కేంద్రంగా మారడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారుముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తొలి బంగారు బార్లను కొనుగోలు చేసిన వారిలో వాసవి బులియన్ కార్పొరేషన్‌కు చెందిన కామసిటి జగదీష్, కేఎంఎస్ జువెలర్స్‌కు చెందిన శ్రీహరిమూర్తి, సాయి సంతోష్ జువెలర్స్‌కు చెందిన చక్రపాణి ఉన్నారు. వీరితో పాటు కోయంబత్తూరుకు చెందిన ఎమ్రోల్డ్ కంపెనీ ప్రతినిధి శ్రీనివాసన్ కూడా బంగారు బార్‌ను అందుకున్నారు. కొందరికి ఒక కిలో, మరికొందరికి అర కిలో బంగారు బార్లను అందజేసినట్లు తెలిపారు.జొన్నగిరి బంగారం నాణ్యత అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోదని జ్యువెలరీ వ్యాపారులు చెబుతున్నారు. 99 శాతం స్వచ్ఛతతో లభిస్తున్న ఈ బంగారం స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి దిగుమతి అయ్యే బంగారంతో సమానమైన నాణ్యత కలిగి ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా, స్థానికంగా ఉత్పత్తి కావడంతో రవాణా, బీమా వంటి అదనపు ఖర్చులు తగ్గి వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.‘మన బంగారం.. మన ఆంధ్రప్రదేశ్‌ది’ అనే నినాదంతో ఈ బంగారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని జ్యువెలరీ షాపుల యజమానులు తెలిపారు. జొన్నగిరి గోల్డ్‌తో తయారైన ఆభరణాలపై ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడంతోపాటు ప్రతి గ్రాముపై అదనపు ప్రయోజనాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. కర్నూలు నేలలో వెలిసిన ఈ బంగారం రాష్ట్ర ఖనిజ రంగానికి కొత్త గుర్తింపునివ్వడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి కూడా కొత్త దిశ చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ కేజీఎఫ్…జొన్నగిరి
RELATED ARTICLES
