అర్జున్ సమాచారం:
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ సమాయత్తమవుతోందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటం సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనకు కట్టుబడి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపును దృష్టిలో ఉంచుకుని త్యాగాలు చేశామని, అదే ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వర్తిస్తుందనుకోవడం పొరపాటని తెలిపారు. శుక్రవారం తెనాలి నియోజకవర్గం చెంచుపేటలో మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… “జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తుంది. నాయకులు, జన సైనికులు, వీరమహిళలకు తగిన అవకాశాలు కల్పించేలా పార్టీ కార్యాచరణ ఉంటుంది. అదే సమయంలో కూటమి భాగస్వామ్యాన్ని గౌరవిస్తూ అన్ని పార్టీలతో సమన్వయం కొనసాగిస్తాం. ప్రజల మేలు కోసం ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసేందుకు 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో నాలుగు అడుగులు వెనక్కి తగ్గాం. అప్పట్లో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలతో ముడిపెడుతూ వచ్చిన వార్తలు సరికావు.
క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు, వీరమహిళల అభిప్రాయాలు, ఆకాంక్షలు, ఆవేదనలను పార్టీ నాయకత్వం పూర్తిగా అర్థం చేసుకుంది. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతాం.
*కూటమి సమన్వయం కోసం కమిటీలు*
రెండు రోజుల క్రితమే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమన్వయ సమావేశం జరిగింది. కూటమిలో ఎక్కడైనా చిన్నచిన్న లోపాలు, సమన్వయ లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నాం. పార్టీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగా యువత, మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించడంతో పాటు, క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమించిన కార్యకర్తలకు భరోసా కల్పించే విధంగా మూడు పార్టీలూ సమన్వయంతో పనిచేస్తాయి. ఇది భాగస్వామ్య పార్టీల ఉమ్మడి బాధ్యత. అదే విధంగా ప్రతి జిల్లాలో సమన్వయం మరింత సమర్థవంతంగా ఉండేందుకు పార్లమెంట్, జిల్లా పరిధిలో ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు వంటి అంశాలపై భాగస్వామ్య పార్టీల మధ్య పరస్పర చర్చల ద్వారా నిర్ణయాలు తీసుకుంటాయ”న్నారు
=========================
సార్వత్రిక ఎన్నికల ఫార్ములా స్థానిక సంస్థల ఎన్నికల్లో వర్తించదు • 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం కోసం నాలుగు అడుగులు వెనక్కి తగ్గాం • కార్యకర్తల ఆవేదన, ఆకాంక్షలు అర్థం చేసుకున్నాం • క్షేత్రస్థాయిలో బలాబలాలను బేరీజు వేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం • ఎన్డీఏ గెలుపే ధ్యేయంగా సమాయత్తమవుతాం • సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికపై కూటమి పార్టీలు కూర్చుని చర్చించుకుంటాయి • జిల్లా, పార్లమెంట్ పరిధిలో సమన్వయ కమిటీలు • తెనాలి మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
RELATED ARTICLES

