శ్రీశైలం,అర్జున్ సమాచారం:
ఆగష్టు 13 నుంచి సెప్టెంబరు 12 వరకు శ్రావణమాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మరియు కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు తెలిపారు.
ఈ మాసోత్సవాలలో అధికసంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచేకాకుండా కర్ణాటక మరియు పలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా భక్తులు శ్రావణంలో ఆలయాన్ని సందర్శిస్తారన్నారు.
ఈ ఉత్సవాల సందర్భంగా భక్తులకు వసతి, మంచినీటిసరఫరా, సౌకర్యవంతమైన దర్శనం, సాధారణ రోజులలో శ్రీస్వామిఅమ్మవార్ల ఆర్జితసేవలు, అన్నప్రసాదాల వితరణ, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగు మొదలైన వాటికి సంబంధించి పలు ఏర్పాట్లు చేయడం జరుగుతోందన్నారు.
సామాన్య భక్తుల సౌకర్యార్థం శ్రావణశనివారాలు, శ్రావణ ఆదివారాలు, శ్రావణసోమవారాలు, వరలక్ష్మీవ్రతం, శ్రావణపౌర్ణమి మొదలైన రోజులలో ( మొత్తం 19 రోజులపాటు) గర్భాలయ అభిషేకాలు మరియు సామూహిక అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చనలు పూర్తిగా నిలుపుదల చేయబడ్డాయన్నారు. అదేవిధంగా ఉదయాస్తమానసేవ, ప్రాత:కాల సేవ, ప్రదోషకాలసేవ పూర్తిగా నిలుపుదల చేయడం జరిగిందన్నారు. ఈ రోజులలో రాత్రివేళలో మాత్రమే పరిమితంగా స్వామివారి స్పర్శదర్శనాన్ని కల్పించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు.
కాగా ఆగష్టు 18, సెప్టెంబరు 1 మరియు సెప్టెంబరు 8వ తేదీలలో ( మంగళవారాలలో) ఉదయం వేళ గర్భాలయ అభిషేకాలు నిలుపుదల చేయబడ్డాయన్నారు.
శ్రావణమాసంలోని మిగతా సాధారణ రోజులలో గర్భాలయ ఆర్జిత అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలు యథావిధిగా కొనసాగుతాయన్నారు.
ప్రస్తుతం అమలులో ఉన్న విధంగానే ప్రతీరోజు వేకువజామున గం.3.00లకే ఆలయద్వారాలు తెరచి మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాత:కాలపూజలు జరిపించబడుతాయన్నారు. ఉభయదేవాలయాలలో గం.4.30 నుంచి మహామంగళహారతులు ప్రారంభించబడుతాయన్నారు.
మహామంగళహారతుల ప్రారంభం నుంచే అనగా గం.4.30లకే భక్తులను దర్శనాలకు అనుమతించడం జరగుతుందన్నారు. సాయంత్రం గం. 4.00ల వరకు ఈ సర్వదర్శనం కొనసాగించబడుతుందున్నారు.
తిరిగి సాయంకాలం గం.4.00 నుంచి ఆలయశుద్ధి కార్యక్రమం నిర్వహించి మంగళ వాయిద్యాలు, ప్రదోషకాలపూజలు, సుసాంధ్యం తరువాత గం.5.30ల నుంచి మహామంగళహారతులు ప్రారంభించబడుతాయన్నారు. మహామంగళహారతుల ప్రారంభం నుంచే అనగా సాయంకాలం గం.5.30ల నుంచే దర్శనాలు కొనసాగుతాయన్నారు.
ఉచితంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
ఇంకా వారు మాట్లాడుతూ శ్రావణమాసంలో భక్తుల సౌకర్యార్థమై మూడు పర్యాయములు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిపించబడుతాయన్నారు.
శ్రావణ రెండవ శుక్రవారం ( 21.08.2026), శ్రావణమూడవ శుక్రవారం ( 28.08.2026) మరియు నాల్గవ శుక్రవారం ( 04.09.2026) సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఉచిత వరలక్ష్మీవ్రతంలో ఒక్కొక్క పర్యాయంలో 1500 మందికి అవకాశం కల్పించబడుతుందన్నారు. రెండవ పర్యాయం జరిగే ఉచిత వరలక్ష్మీవ్రతంలో ప్రత్యేకంగా 1000 మంది శివసేవకులకు అవకాశం కల్పించబడుతుందన్నారు. మూడవ పర్యాయం జరిగే ఉచిత వరలక్ష్మీవ్రతంలో ప్రత్యేకంగా 750 మంది చెంచు ముత్తైదవలకు, 750 మంది ఇతర ముత్తైదవలకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సామూహిక వరలక్ష్మీవ్రతం జరిపించుకునే భక్తులందరికీ ప్రసాదాలతో పాటు చీర మరియు రవిక వస్త్రం, గాజులు, పసుపుకుంకుమలు, కైలాసకంకణాలు, శ్రీశైలప్రభ మాసపత్రిక, వృక్షప్రసాదంగా దేవతా వృక్షం కూడా అందజేయబడుతాయన్నారు. వ్రతకర్తలకు శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనం కల్పించడంతో పాటు అన్నప్రసాదవితరణ భవనములో భోజన ప్రసాదం కూడా అందజేయబడుతుందన్నారు. వ్రతకర్తలను అలంకార దర్శనమునకు మాత్రమే అనుమతించబడుతుందన్నారు.
భక్తుల సౌకర్యార్థం క్యూకాంప్లెక్స్‌లోని భక్తులకు నిరంతరం మంచినీరు, బిస్కెట్లు, అల్పాహారం అందజేయబడుతాయన్నారు. ఉదయం వేళలో వేడిపాలు కూడా అందజేయబడుతాయన్నారు.
భక్తులకు సేవలు అందించేందుకుగాను శ్రావణమాసంలో రద్ధీరోజులందు కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించబడ్డాయన్నారు. శ్రావణ రద్దీరోజులలో దాదాపుగా కార్యాలయ సిబ్బంది అందరు ప్రత్యేక విధులను నిర్వహిస్తారన్నారు.
భక్తులకు అన్నప్రసాదవితరణ భవనములో ఉదయం గం.10.30ల నుండి అన్నప్రసాదాల వితరణ చేయడం జరుగుతుందన్నారు. అలాగే అన్నప్రసాదవితరణ భవనములో రాత్రి గం. 7.00ల నుంచి భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయబడిందన్నారు.
ధర్మప్రచారంలో భాగంగా శ్రావణమాసంలో అఖండశివభజనలను నిర్వహిస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు.
దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలను భక్తులు వినియోగించుకోవాలని దర్మకర్తల మండలి అధ్యక్షులు మరియు కార్యనిర్వహణాధికారి కోరారు.
==========================

