ePaper
Friday, August 14, 2026
ePaper
Homeతెలంగాణవికారాబాద్ఉప్పొంగిన కాగ్నానది వికారాబాద్

ఉప్పొంగిన కాగ్నానది వికారాబాద్

📰 Generate e-Paper Clip

వికారాబాద్,అర్జున్ సమాచారం:

ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు తాండూరు ప్రాంత ప్రజలకు ఊరటనిచ్చాయి. ఎండిపోయి వెలవెలబోయిన కాగ్నానది ఇప్పుడు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ నీటి ప్రవాహం రైతుల్లో కొత్త ఆశలను నింపగా… తాండూరు పట్టణ ప్రజల తాగునీటి సమస్యకు తాత్కాలిక ఉపశమనాన్ని అందించింది. మరోవైపు అక్రమ ఇసుక రవాణాకు కూడా తాత్కాలికంగా బ్రేక్ పడింది. .
ఎగువ ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షాలతో కాగ్నానది పరవళ్లు తొక్కుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు ఇసుక మేటలతో కనిపించిన నది… ఇప్పుడు జలకళను సంతరించుకుంది.
నదిలోకి భారీగా నీరు చేరడంతో పరివాహక ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో నీటి మట్టం మెరుగుపడుతుందని, రాబోయే సాగు సీజన్‌కు ఈ నీరు ఎంతో ఉపయోగపడుతుందని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తాండూరు పట్టణ ప్రజలకు కూడా ఈ ప్రవాహం ఊరటనిచ్చింది. తాగునీటి వనరులకు నీరు చేరడంతో కొంతకాలంగా నెలకొన్న తాగునీటి సమస్యకు తాత్కాలిక ఉపశమనం లభించనుంది.
మరోవైపు కాగ్నానదిలో నీటి ఉద్ధృతి పెరగడంతో అక్రమ ఇసుక తవ్వకాలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రతిరోజూ ఇసుక కోసం నదిలోకి వచ్చే ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు నీటి ప్రవాహం కారణంగా వెనుదిరిగాయి. దీంతో ఇసుక మాఫియా కార్యకలాపాలకు తాత్కాలికంగా చెక్ పడినట్లైంది.
స్థానికులు మాత్రం ఇదే తరహాలో వర్షాలు కొనసాగి కాగ్నానది ఎప్పటికప్పుడు నీటితో కళకళలాడాలని, చెరువులు, కుంటలు నిండిపోవాలని, రైతులకు పుష్కలంగా సాగునీరు అందాలని కోరుకుంటున్నారు
ప్రకృతి వరంగా వచ్చిన ఈ నీరు రైతుల్లో కొత్త ఆశలను చిగురింపజేయడమే కాకుండా… తాండూరు ప్రజలకు తాగునీటి ఊరటను అందించింది. అదే సమయంలో అక్రమ ఇసుక రవాణాపై కూడా తాత్కాలికంగా అడ్డుకట్ట వేసింది. కాగ్నానదిలో ప్రవాహం మరికొన్ని రోజులు కొనసాగుతుందా లేదా అన్నది రానున్న వర్షాలపై ఆధారపడి ఉంది.
=========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!