ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడు అరెస్ట్పగటిపూట రెక్కీ.. రాత్రివేళ తాళాలు...

తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడు అరెస్ట్పగటిపూట రెక్కీ.. రాత్రివేళ తాళాలు పగులగొట్టి చోరీలుభార్యతో పాటు మరో ముగ్గురితో కలిసి దొంగతనాలు.. బంగారం, నగదు తాకట్టు, విక్రయం.

📰 Generate e-Paper Clip

తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడు అరెస్ట్పగటిపూట రెక్కీ.. రాత్రివేళ తాళాలు పగులగొట్టి చోరీలుభార్యతో పాటు మరో ముగ్గురితో కలిసి దొంగతనాలు.. బంగారం, నగదు తాకట్టు, విక్రయం.

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 08:
తాళం వేసి ఉన్న ఇళ్లను పగటిపూట పరిశీలించి, రాత్రివేళ తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు, నగదు దొంగిలిస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని మంథని సీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం, రామగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ మంథని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

గస్తీలో పట్టుబడిన నిందితుడు
ఆగస్టు 08న మరోసారి తాళం వేసిన ఇళ్లను పరిశీలిస్తూ నడుచుకుంటూ తిరుగుతున్న వనం రాము పోలీసుల కంటపడ్డాడు. రామగిరి ఎస్సై టి. శ్రీనివాస్ సిబ్బందితో గస్తీ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని పట్టుకున్నారు. సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో తనిఖీ చేయగా అతని వద్ద బటన్ కత్తి లభించింది. పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేసేందుకు వచ్చినట్లు అంగీకరించడంతో పాటు గతంలో చేసిన పలు చోరీల వివరాలను వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

భార్యతో పాటు మరో ముగ్గురితో కలిసి చోరీలు
జగిత్యాల జిల్లా తారక రామనగర్‌కు చెందిన వనం రాము (36), నరసింహ కుమారుడు. ఇతనికి కందెల అలియాస్ వనం కవితతో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహమైంది. గతంలో గ్రామాల్లో తిరుగుతూ తల వెంట్రుకలు సేకరించి విక్రయించేవాడు. ఆ ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడినట్లు ఏసీపీ తెలిపారు.

తన భార్య కవితతో పాటు జగిత్యాల రామనగర్‌కు చెందిన దాసరి రవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి గ్రామానికి చెందిన వనం పాపయ్య, అశ్వారావుపేటకు చెందిన తన చిన్న తమ్ముడు వనం నగేష్‌లతో కలిసి చోరీలకు పాల్పడేవాడని తెలిపారు. పగటిపూట వివిధ వాహనాల్లో గ్రామాల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి, రాత్రివేళ అక్కడికి వెళ్లి తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేసేవారు. గతంలో రాయికల్, జగిత్యాల ప్రాంతాల్లో కూడా చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

పలు ప్రాంతాల్లో వరుస చోరీలు
2025 అక్టోబర్ 10న కల్వచర్లలో తాళం వేసిన ఇంటి తాళం పగులగొట్టి రెండు బంగారు ఉంగరాలు, చిన్న ఉంగరం, బంగారు కడియం, చెవి కమ్మలు, రూ.40 వేల నగదు దొంగిలించారు. అనంతరం ఓడేడు వైపు వెళ్తూ మరో ఇంటిలోకి ప్రవేశించి బంగారు గాజులు, నల్లపూసల దండ, బంగారు పెద్ద గొలుసు, మరో గొలుసుతో పాటు రూ.లక్ష నగదును అపహరించారు.

2025 నవంబర్ 18న ముత్తారం ప్రాంతంలో తాళం వేసిన ఇంటిలో చోరీకి ప్రయత్నించినా ఆభరణాలు, నగదు లభించలేదు. అనంతరం కల్వచర్లలో మరో ఇంటి కబోర్డు తాళం పగులగొట్టి రూ.15 వేల నగదు దొంగిలించారు.

2026 జనవరి 25న ధర్మారం మండలం దొంగతోటి గ్రామంలో తాళం వేసిన ఇంటిలోకి ప్రవేశించి బీరువాలోని బంగారు ఆభరణాలను చోరీ చేశారు. జనవరి 31న అద్దె కారులో కల్వచర్లకు వెళ్లి మరో ఇంటిలో చోరీకి ప్రయత్నించినా ఆభరణాలు, నగదు లభించలేదు.

ఫిబ్రవరి 06న ధర్మారం మండలం పత్తిపాకలో తాళం వేసిన ఇంటిలోకి ప్రవేశించి బీరువాలోని వెండి, బంగారు ఆభరణాలను దొంగిలించారు. మార్చి 13న రత్నాపురంలో సుమారు 6 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.9,500 నగదును అపహరించారు.

ఏప్రిల్ 15న దొంగతనం చేయాలనే ఉద్దేశంతో పెద్దపల్లి ప్రాంతంలో తిరుగుతుండగా పోలీసులు కనిపించడంతో రాము, అతని భార్య కవిత పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా రాము తప్పించుకున్నట్లు తెలిపారు. అదే సమయంలో రవి, పాపయ్య, నగేష్‌లు కల్వచర్లలో పోలీసులకు చిక్కేందుకు ప్రయత్నించినట్లు నిందితుడు వెల్లడించాడు.

జూన్ 02న జూలపల్లి గ్రామంలో తాళం వేసిన ఇంటిలోకి ప్రవేశించి బీరువాలోని బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు రాము అంగీకరించాడు.

దొంగిలించిన ఆభరణాలు తాకట్టు.. కొంత విక్రయం
ఓడేడు గ్రామంలో దొంగిలించిన నల్లపూసల గొలుసుతో పాటు కల్వచర్లలో చోరీ చేసిన బంగారు ఆభరణాలను జగిత్యాలలోని ముత్తూట్ పిన్‌కార్ప్‌లో తన పేరుతో తాకట్టు పెట్టినట్లు నిందితుడు వెల్లడించాడు. వాటి ద్వారా వచ్చిన నగదును ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు తెలిపాడు. మరికొన్ని ఆభరణాలను జగిత్యాల టవర్ సర్కిల్‌లో నగల దుకాణం నిర్వహించే గంగారం అనే వ్యక్తికి విక్రయించినట్లు, అయితే ఆయన కొన్ని నెలల క్రితం మృతి చెందినట్లు పేర్కొన్నాడు.

ఆభరణాల విక్రయం ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని రవి, పాపయ్య, నగేష్‌లకు ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని భార్య ఖర్చులు, జల్సాలకు వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. ఓడేడు గ్రామంలో దొంగిలించిన రూ.లక్షతో పాటు గతంలో చోరీ చేసిన నగదును కలిపి ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడెంకు చెందిన జగన్నాథం లక్ష్మణరావు వద్ద సెప్టిక్ ట్యాంకర్ కొనుగోలు కోసం రూ.2 లక్షలు చెల్లించినట్లు నిందితుడు వెల్లడించాడు.

నిందితుడి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. చోరీలకు సంబంధించిన ఆస్తి రికవరీతో పాటు ఇతర నిందితుల పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పోలీసు సిబ్బందికి అభినందనలు
నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మంథని సీఐ బి. స్వామి, రామగిరి ఎస్సై టి. శ్రీనివాస్, పోలీసు కానిస్టేబుళ్లు డి. రమేష్, వి. అభిషేక్, బి. రాజ్‌కుమార్‌లను ఏసీపీ ఎం. రమేష్ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!