ePaper
Saturday, November 28, 2026
ePaper
Homeఎడిటోరియల్ఐదంచల వ్యూహాంతో బీజేపీ.

ఐదంచల వ్యూహాంతో బీజేపీ.

📰 Generate e-Paper Clip

ఐదంచల వ్యూహాంతో బీజేపీ.

విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 28.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం, లోక్‌సభ స్థానాల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు బిజెపి ఐదు ప్రధాన వ్యూహాలతో ముందుకెళ్తోంది. నవంబర్ 30 నుంచి లోక్‌సభ, డిసెంబర్ 2 నుంచి రాజ్యసభ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలపై కసరత్తు ముమ్మరమైంది. ఏప్రిల్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేకపోయింది. ఈసారి సంఖ్యాబలాన్ని పెంచుకోవడంపై బిజెపి దృష్టి సారించింది. విపక్ష పార్టీల్లో చీలికలు, ప్రాంతీయ పార్టీల మద్దతు, ఎంపిల గైర్హాజరు వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి,కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో విడివిడిగా చర్చలు జరిపి మద్దతు కూడగట్టడం బిజెపి తొలి వ్యూహంగా కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్‌కు మద్దతు ఇస్తున్న పార్టీలను డీలిమిషన్ అంశంలో ఒప్పించేందుకు ప్రయత్నించవచ్చు. విపక్ష ఎంపిలు కొందరు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం లేదా ఓటింగ్‌కు దూరంగా ఉండడం జరిగితే ప్రభుత్వానికి ప్రయోజనం కలగవచ్చు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందని దక్షిణాది పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం జరగకూడదనే వాదన బలంగా వినిపిస్తోంది. రాష్ట్రాల ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తిని కొనసాగించేలా హామీ ఇవ్వడం ద్వారా డిఎంకె వంటి ప్రాంతీయ పార్టీలను ఒప్పించేందుకు బిజెపి ప్రయత్నించవచ్చు. అయితే దీనిపై అధికారికంగా తుది నిర్ణయం వెలువడలేదు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే అంశాన్ని ప్రజల్లోకి విసృ్తతంగా తీసుకెళ్లాలని బిజెపి భావిస్తోంది. మహిళా ఓటర్లను ఆకర్షించడంతోపాటు మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలద్వారా ప్రచారం చేయవచ్చు. బిల్లుకు మద్దతు ఇస్తున్నామని చెబుతూ, దాని అమలుకు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ విపక్షాలపై రాజకీయ విమర్శలు చేసే అవకాశం ఉంది. అయితే మహిళా రిజర్వేషన్‌కు మద్దతు ఇస్తూనే డీలిమిషన్‌ను వేరుగా చూడాలని విపక్షాలు కోరుతున్నాయి. డిఎంకె, సమాజ్‌వాదీ పార్టీ, ఇతర ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరిపి బిల్లుకు మద్దతు పొందడం మరో వ్యూహం. రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగదని భరోసా ఇవ్వడం ద్వారా రాజకీయ విభేదాలను తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. అయితే ఈ పార్టీల మద్దతు లభిస్తుందనే విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రత్యేక మెజారిటీ సాధన: రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి సభ మొత్తం సభ్యుల్లో సగానికి పైగా మద్దతుతోపాటు, ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల మంది అనుకూలంగా ఓటు వేయాలి. లోక్‌సభ, రాజ్యసభల్లో విడివిడిగా ఈ మెజారిటీ సాధించాల్సి ఉంటుంది. ఎన్‌డిఎ భాగస్వామ్య పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంతోపాటు ఇతర పార్టీల మద్దతు కూడగట్టడం బిజెపికి అత్యంత కీలకం. ఎంపిల గైర్హాజరు వల్ల ఓట్ల లెక్క మారవచ్చు. అయితే అవసరమైన ప్రత్యేక మెజారిటీ సాధించకుండా బిల్లు ఆమోదం పొందదు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసుకుం బిజెపికి మహిళా ఓటర్లలో రాజకీయ ప్రయోజనం కలగవచ్చు. అదే సమయంలో డీలిమిషన్ వల్ల రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్యంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. విపక్షాల ఐక్యత, దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలు, రాజ్యసభలో సంఖ్యాబలం ప్రభుత్వానికి సవాలుగా మారనున్నాయి. మహిళా రిజర్వేషన్‌ను డీలిమిషన్‌తో అనుసంధానించకుండా అమలు చేయాలన్న విపక్షాల డిమాండ్‌పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది కీలకం. పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు రూపం, రాజకీయ మద్దతు, ఓటింగ్ సమీకరణాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.మహిళలకు లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు 2023లో నారీ శక్తి వందన్ అధినియమ్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ రిజర్వేషన్ల అమలును జనగణన, ఆ తర్వాత చేపట్టే డీలిమిటేషన్ ప్రక్రియతో అనుసంధానించారు. ఇప్పుడు 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలను ముందుకు తెస్తోంది. ఈ ప్రక్రియ కోసం ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన 3 బిల్లులను మళ్లీ ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026: లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్యను 850కి పెంచడం, మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గం కల్పించడం. డీలిమిటేషన్ బిల్లు , 2026: లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు.కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2026: ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూకశ్మీర్ ఎన్నికల వ్యవస్థకు అవసరమైన మార్పులు చేయడం.రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో పార్లమెంట్‌లో సాధారణ మెజారిటీ సరిపోదు. సభకు హాజరై ఓటు వేసిన సభ్యుల్లో కనీసం మూడింట రెండొంతుల మంది మద్దతుతోపాటు.. సభ మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ మద్దతు కూడా అవసరం. ప్రస్తుతం లోక్‌సభలో 543 స్థానాలకు గాను 3 ఖాళీలు ఉండటంతో క్రియాశీల సభ్యుల సంఖ్య 540గా ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. సభ్యులందరూ ఓటింగ్‌లో పాల్గొంటే బిల్లు ఆమోదం పొందడానికి కనీసం 360 మంది మద్దతు అవసరం. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి సుమారు 320 మంది ఎంపీల మద్దతు ఉన్నట్లు అంచనా. దీంతో బిల్లు ఆమోదం పొందాలంటే కూటమికి వెలుపల ఉన్న పార్టీల మద్దతు ఇప్పుడు అత్యంత కీలకం కానుంది. వైసీపీ సహా కొన్ని ప్రాంతీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలు.. ఈ బిల్లు ఆమోదం పొందే ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు అవసరమైన ప్రత్యేక మెజారిటీ సాధించలేకపోయింది. అప్పట్లో 528 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనగా.. బిల్లు ఆమోదానికి అవసరమైన 352 ఓట్లకు 54 ఓట్లు తక్కువగా వచ్చాయి. దీంతో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఆ తర్వాత ప్రతిపక్ష శిబిరం నుంచి సుమారు 26 మంది ఎంపీలు బయటకు వచ్చి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పరిస్థితి ఏర్పడిందని తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇందులో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలు, శివసేన (యూబీటీ) నుంచి ఆరుగురు ఎంపీలు ఉన్నట్లు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ ప్రత్యేక మెజారిటీకి అవసరమైన సంఖ్యను చేరుకోవాలంటే ఎన్‌డీఏ మరికొన్ని పార్టీల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది.లోక్‌సభతోపాటు రాజ్యసభలో కూడా బిల్లుకు ప్రత్యేక మెజారిటీ సాధించాల్సి ఉంటుంది. రాజ్యసభలో క్రియాశీల సభ్యుల సంఖ్య సుమారు 244గా ఉండటంతో.. సభ్యులందరూ ఓటింగ్‌లో పాల్గొంటే కనీసం 164 మంది మద్దతు అవసరమని అంచనా. ఎన్‌డీఏకు అక్కడ కూడా అవసరమైన సంఖ్యను చేరుకోవడానికి ఇతర పార్టీల మద్దతు అవసరం అవుతుంది. నవంబర్ 30వ తేదీన లోక్‌సభ.. డిసెంబర్ 2వ తేదీన రాజ్యసభ సమావేశం కానున్నాయి. అవసరాన్ని బట్టి డిసెంబర్ 3వ తేదీ వరకు సమావేశాలు కొనసాగవచ్చు. ఈ ప్రత్యేక సమావేశాల్లో బిల్లులపై చర్చ, ఓటింగ్ జరిగే అవకాశముంది. అయితే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాతే ప్రతిపాదనలు చట్టరూపం దాలుస్తాయి. మహిళా రిజర్వేషన్ల అమలు, లోక్‌సభ స్థానాల పెంపు, రాష్ట్రాల ప్రాతినిధ్య నిష్పత్తిపై ఈ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!