సింగరేణి ఉద్యోగి దారుణ హత్య.. ఫోన్ చేసి ఇంటి బయటకు పిలిచి కత్తులతో దాడి…
పథకం ప్రకారమే హత్య చేసినట్లు అనుమానాలు.. నలుగురు యువకులపై పోలీసుల గాలింపు
పెద్దపల్లి, అర్జున్ సమాచారం, నవంబర్ 23:
పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని గోదావరిఖనిలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. సింగరేణి సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్న రాజశేఖర్ (30)ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. పవర్‌హౌస్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
అందిన సమాచారం ప్రకారం.. పథకం ప్రకారమే రాజశేఖర్‌కు ఫోన్ చేసిన కొందరు యువకులు, అతడిని ఇంటి బయటకు పిలిచారు. ముందస్తు ప్రణాళికతో అక్కడికి చేరుకున్న యువకులు రాజశేఖర్‌పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురు యువకులు పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం.
హత్య విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వ్యక్తిగత కక్షలా, మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలో సింగరేణి ఉద్యోగి హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

