8టీబీ ముక్త్ పంచాయతీలకు సన్మానం,జిల్లా కలెక్టర్ కె. హరిత పిలుపు.
ఆసిఫాబాద్, అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 8.
జిల్లాలో క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేసి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దామని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు.
గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో “క్షయ నిర్మూలనకు యువత సన్నద్ధం – టీబీ ముక్త్ పంచాయతీలకు సన్మాన కార్యక్రమం” జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధి అంటు వ్యాధి అని, లక్షణాలు కలిగిన వారిని ఆరంభంలో గుర్తించి 6 నెలల పాటు చికిత్స, మంచి పోషకాహారం అందిస్తే నిర్మూలించవచ్చని తెలిపారు.
యువత, వైద్యులు, సర్పంచ్ లు, పాలకవర్గాలు తమ గ్రామాల్లో క్షయపై ప్రజలను చైతన్యపరచాలని, లక్షణాలున్న వారి సమాచారాన్ని వైద్య సిబ్బందికి తెలియజేయాలని సూచించారు.
అనంతరం క్షయ రహిత గ్రామ పంచాయతీలుగా ఎంపికైన ఆసిఫాబాద్ మండలం గోవింద్ పూర్, బెజ్జూర్ మండలం పోతేపల్లి, జైనూర్ మండలం పవార్ గూడ, కేరమేరి మండలం సాంగ్వి, సిర్పూర్ (టి) మండలం ఇటిక్యాలపహాడ్, వాంకిడి మండలం దాబా గ్రామాల సర్పంచ్ లు, వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ నాగేంద్ర, డీపీవో బిక్షపతి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ వెంకట్, ఎంపీడీఓలు, సర్పంచ్ లు, వైద్యులు, ఎన్సీసీ విద్యార్థులు, గిరిజన గురుకుల బాలికల డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు

