రాజాపూర్ సింగరేణి బాధితులకు ప్రకటనలు కాదు.. సమస్యకు పరిష్కారం కావాలి!
రామగిరి (మండలం)అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 20.
పదినెలలుగా కొనసాగుతున్న హామీలపై బాధితుల ప్రశ్నలు.. అవార్డు ఎంక్వయిరీ, ఇళ్ల జాబితా ఆమోదంపై స్పష్టత ఏదీ?
రాజాపూర్ గ్రామానికి చెందిన సింగరేణి బాధితుల సమస్య పరిష్కారం కోసం నాయకులు చేస్తున్న ప్రకటనలు, అధికారుల చర్యల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఎన్ (PN) వచ్చినప్పటి నుంచి ఎనిమిది నెలలుగా వివిధ హామీలు వింటున్నప్పటికీ, తమ సమస్యకు మాత్రం పరిష్కారం లభించడం లేదనివారు ప్రశ్నిస్తున్నారు. రోజుకో మాట పూటకోమాటతో కాలం గడుస్తోందని, తమ భవిష్యత్తుపై ఇప్పటికీ స్పష్టత లేకుండా పోతోందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాయకుల మాటలు ఒకలా.. అధికారుల చేతలు మరోలా!
రాజాపూర్ గ్రామ సమస్యపై నాయకులు చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో అధికారుల చర్యలకు పొంతన ఉండటం లేదని బాధితుల తరఫున ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మంత్రి శ్రీధర్ బాబు సమస్య పరిష్కారంపై స్పందిస్తున్నప్పటికీ, అధికారులు మాత్రం తమ ప్రక్రియను కొనసాగిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు .అవార్డు ఎంక్వయిరీని నిలిపివేయాలని నాయకులు చెబుతున్నారని, మరోవైపు ఈ నెల 18వ తేదీన హాజరుకావాలని అధికారులు నోటీసులు ఇచ్చి గుట్టుచప్పుడు కాకుండా వుండి పోయారని, బాధితులు ఆరోపిస్తున్నారు.
నాయకులు ఒక విధంగా చెబుతుండగా, అధికారులు మరో విధంగా వ్యవహరిస్తున్నారనే పరిస్థితిలో చివరకు నష్టపోయేది బాధితులేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో అసలు ఏం జరుగుతోంది? తమకు ఇచ్చిన హామీల అమలు ఎక్కడి వరకు వచ్చింది? అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం ఎందుకు రావడం లేదు? అనే ప్రశ్నలు గ్రామస్థుల్లో నెలకొన్నాయి.
ఇళ్ల జాబితా ఆమోదంపై స్పష్టత ఏది?
రాజాపూర్ గ్రామానికి చెందిన ఇళ్ల జాబితాను సిద్ధం చేసి కలెక్టర్‌కు అందజేయాలని బ్లాక్ కాంగ్రెస్ నాయకుడి సమక్షంలో మంత్రి సూచించడంతోనే ఆ జాబితాను సమర్పించామని బాధితుల తరఫున ప్రశ్నిస్తున్నారు. అయితే, ఆ జాబితా ప్రస్తుతం ఏ దశలో ఉంది? దానికి ఆమోదం లభించిందా? లేదా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.
ఇళ్ల జాబితా ఆమోదం కోసం చర్యలు తీసుకోవాల్సిన సమయంలో, కేవలం అవార్డు ఎంక్వయిరీని నిలిపివేయాలని కోరడం వల్ల ప్రయోజనం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యకు సంబంధించిన ప్రధాన అంశమైన జాబితా ఆమోదంపై దృష్టి సారించి, దాని పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
కలెక్టర్‌ను కలవాలన్న సూచనపై ప్రశ్నలు
స్వయంగా మంత్రి కలెక్టర్‌ను కలవాలని సూచించినప్పటికీ, బాధితులు వెళ్లకపోవడం తమ వైపు జరిగిన పొరపాటేనని ప్రశ్నించే స్వరాలు కూడా వినిపిస్తున్నాయి. తమ సమస్య పరిష్కారం కోసం బాధితులే చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నారు. అవసరం బాధితులకే ఉన్నప్పుడు, అధికారులను కలిసి సమస్య పురోగతిని తెలుసుకోవడంలో ఎందుకు వెనుకడుగు వేయాలనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు.
అదే సమయంలో, మంత్రి సూచించిన అంశాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇళ్ల జాబితా ఆమోదానికి సంబంధించిన ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయింది? బాధితులకు స్పష్టమైన సమాచారం ఎందుకు అందడం లేదు? అనే ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలని కోరుతున్నారు.
హామీలు కాదు.. బాధితులకు న్యాయం చేయాలి
రాజాపూర్ గ్రామ సమస్య రాజకీయ ప్రకటనలకే పరిమితం కాకుండా, ఆచరణలో పరిష్కారం దిశగా సాగాలని బాధితుల తరఫున డిమాండ్ వినిపిస్తోంది. రాజకీయ నాయకుల హామీలను నమ్ముతూ ఇంతకాలం ఎదురుచూసినప్పటికీ, సమస్య పరిష్కారం కాకపోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంటున్నారు.
ప్రజల హక్కుల కోసం పోరాడాల్సిన సమయంలో రాజకీయ ప్రయోజనాల మధ్య బాధితులు ఇబ్బందులు పడకూడదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇళ్ల జాబితాపై స్పష్టత ఇవ్వడం, అవార్డు ఎంక్వయిరీ ప్రక్రియపై వివరాలు వెల్లడించడం, అధికారుల నుంచి సమాధానం పొందడం వంటి అంశాలపై తక్షణమే దృష్టి సారించాలని కోరుతున్నారు.
రాజాపూర్ సింగరేణి బాధితులకు కావాల్సింది కొత్త ప్రకటనలు, మరిన్ని హామీలు కాదని, తమ సమస్యకు పరిష్కారం చూపే కార్యాచరణ అని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు సమన్వయంతో ముందుకు వచ్చి బాధితులకు స్పష్టతనిచ్చి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

