ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeతెలంగాణజీవో 97 రద్దు చేయాలి.. డిప్లొమా విద్యకు రక్షణ కల్పించాలి.

జీవో 97 రద్దు చేయాలి.. డిప్లొమా విద్యకు రక్షణ కల్పించాలి.

📰 Generate e-Paper Clip

జీవో 97 రద్దు చేయాలి.. డిప్లొమా విద్యకు రక్షణ కల్పించాలి.

అర్జున్ సమాచారం. ఆగస్టు 19. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.

నస్పూర్, ఆగస్టు 19:యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 97ను తక్షణమే రద్దు చేయాలని పీడీఎస్‌యూ డిమాండ్ చేసింది. జీవోను వ్యతిరేకిస్తూ నస్పూర్‌లో పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసనకు పీడీఎస్‌యూ నాయకులు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు పి. సికిందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి పథకం, జీవో నెం. 97 కారణంగా పాలిటెక్నిక్ విద్యార్థుల విద్యా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన అనంతరం ఇంజినీరింగ్‌లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు తాజా నిర్ణయాలు ఆటంకంగా మారుతున్నాయని అన్నారు. దీని వల్ల విద్యార్థులు తిరిగి ఇంటర్మీడియట్ చదవాల్సిన పరిస్థితి ఏర్పడి, విలువైన విద్యా కాలం వృథా అయ్యే ప్రమాదం ఉందన్నారు.
యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం పేరుతో డిప్లొమా కోర్సులను పారిశ్రామిక శిక్షణ సంస్థలు, అధునాతన శిక్షణ కేంద్రాలతో అనుసంధానం చేయడం వల్ల డిప్లొమా విద్యకు ఉన్న ప్రత్యేకత, ప్రాధాన్యత దెబ్బతింటుందని అన్నారు. సాంకేతిక విద్యను మరింత బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, డిప్లొమా విద్యను సాధారణ శిక్షణ స్థాయికి తగ్గించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.
రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి స్వతంత్రతను దెబ్బతీసే విధంగా జీవో నెం. 97 ఉందని పీడీఎస్‌యూ నాయకులు విమర్శించారు. పాలిటెక్నిక్ విద్యకు ప్రత్యేక గుర్తింపును, సాంకేతిక విద్యా ప్రమాణాలను, విద్యార్థుల ఉన్నత విద్య అవకాశాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
పీడీఎస్‌యూ ప్రధాన డిమాండ్లు ఇవే: జీవో నెం. 97ను వెంటనే రద్దు చేయాలి. పాలిటెక్నిక్ డిప్లొమా విద్య ప్రాధాన్యతను, ప్రత్యేకతను కాపాడాలి. డిప్లొమా విద్యను పారిశ్రామిక శిక్షణ సంస్థలు, అధునాతన శిక్షణ కేంద్రాలతో అనుసంధానం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి స్వతంత్రతను కాపాడాలి. డిప్లొమా విద్యార్థులకు ఇంజినీరింగ్‌లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించాలి. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలపై విద్యార్థి సంఘాలు, సాంకేతిక విద్యా నిపుణులతో ప్రభుత్వం చర్చించాలి.
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడవద్దని, తక్షణమే జీవో నెం. 97ను రద్దు చేసి పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలని పీడీఎస్‌యూ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులను ఐక్యం చేసి మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించింది.
ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు కే. కార్తీక్, జిల్లా నాయకుడు అంజి పటేల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!