హైదరాబాద్, ఆగస్టు 19,అర్జున్ సమాచారం:
కేంద్ర ఎన్నికల సంఘం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చేపట్టిన సమగ్ర ప్రక్షాళన ప్రక్రియ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. రెండు రాష్ట్రాల్లో కలిపి సాంకేతికంగా కోటి ఇరవై లక్షలకు పైగా ఓట్లు చెల్లుబాటు కాకుండా పోతున్నాయి. జాబితా నుంచి తొలగింపునకు గురవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే అయినప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయకపోవడం, సైలెంట్‌గా ఉండటం వెనుక ఏం జరుగుతోంది? వాస్తవానికి ఈ గల్లంతు ప్రక్రియ అంతా అర్హులైన ఓటర్లను తొలగించడం కాదని, ఓటర్ల జాబితాను క్లీన్ క్రమంలో జరుగుతున్న సాంకేతిక ప్రక్రియ అని పార్టీలకు స్పష్టమైన అవగాహన ఉంది. ఉమ్మడి రాష్ట్ర విడిపోయాక , హైదరాబాద్ కేంద్రంగా స్థ స్థిరపడిన లక్షలాది మందికి ఏపీ, తెలంగాణ రెండింటిలోనూ ఓట్లు ఉన్నాయి. దీనికి తోడు మరణించిన వారి పేర్లు తొలగించకపోవడం, ఆధార్‌తో ఎపిక్ సీడింగ్ జరగడం వల్ల ఈ డూప్లికేట్ , ఇన్-యాక్టివ్ ఓట్లను ఈసీ వ్యవస్థ పసిగట్టి తొలగిస్తోంది. ఇది ఓటు హక్కును కాలరాయడం కాదని తెలిసే ప్రధాన పార్టీలు దీనిపై వీధిపోరాటాలకు దిగడం లేదు.అయితే, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని ఈసీ వద్ద తరచూ ఫిర్యాదులు చేస్తోంది. దీని వెనుక కాంగ్రెస్ పార్టీకి బలమైన రాజకీయ సమీకరణాలు ఉన్నాయి. గడిచిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే, పట్టణ ప్రాంతాల్లో ఉన్న బోగస్, డబుల్ ఓట్లు ఫలితాలను ప్రభావితం చేశాయని కాంగ్రెస్ భావిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ, ఇతర పట్టణాల్లోనూ క్రమబద్ధీకరణ జరిగితే క్లీన్ ఓటర్ లిస్ట్ వల్ల తమకే పొలిటికల్ అడ్వాంటేజ్ ఉంటుందని కాంగ్రెస్ లెక్కిస్తోంది. అందుకే ప్రతి బూత్ స్థాయిలో తమ బూత్ లెవల్ ఏజెంట్లను అలర్ట్ చేస్తూ, తొలగింపులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.మరోవైపు బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి సైలెంట్‌గా ఉండటానికి కారణం.. క్షేత్రస్థాయి రియాలిటీయే. ఆయా పార్టీల అంతర్గత సర్వేల ప్రకారం, తొలగింపునకు గురవుతున్న ఓట్లలో అత్యధికం నివాసాలు మారిన వారివి, లేదా డబుల్ ఓటింగ్‌కు అవకాశం ఉన్నవే. ఒకవేళ పొరపాటున నిజమైన ఓటరు పేరు తొలిగినా, వారిని మళ్లీ ఫారమ్-6 ద్వారా దరఖాస్తు చేయించి ఓటరుగా నమోదు చేయించవచ్చనే సాంకేతిక వెసులుబాటు ఈసీ కల్పిస్తోంది. రచ్చ చేయడం కంటే క్షేత్రస్థాయిలో బిఎల్ఓ ల వద్ద తమ ఏజెంట్ల ద్వారా ఓట్ల పునరుద్ధరణ చేయించుకోవడమే ఉత్తమ మార్గమని పార్టీల భావన.వాస్తవానికి ఎన్నికల సంఘం పారదర్శకంగా ఫారమ్-7 దరఖాస్తులు, క్లెయిమ్స్ , అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియను నిర్వహిస్తుండటంతో చట్టపరంగా దీన్ని ప్రశ్నించే అవకాశం తక్కువగా ఉంది. కోటి ఇరవై లక్షల ఓట్ల ప్రక్షాళన అనేది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే క్రమంలో జరుగుతున్న ఒక ప్రక్షాళన. నిరసనలు, ఆందోళనల కంటే నిశ్శబ్దంగా బూత్ స్థాయిలో తమ మద్దతుదారుల ఓట్లు జాబితాలో ఉండేలా చూసుకోవడమే రాజకీంగా ప్రయోజనకరమని భావించి పార్టీలు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాయి. తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర ఓటర్ల సవరణ ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవడంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అధికారికంగా ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లలో 2.64 కోట్లకు పైగా మంది ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించగా, వీరి పేర్లను ముసాయిదా జాబితాలో చేర్చారు. క్షేత్రస్థాయిలో డోర్-టు-డోర్ వెరిఫికేషన్ పూర్తయిన అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఈ ముసాయిదా వివరాలను వెల్లడించారుమరోవైపు, ఎన్యుమరేషన్ సర్వే సమయంలో దాదాపు 73.39 లక్షల అంటే 21.7 శాతం ఎంట్రీలు అన్‌కలెక్టబుల్ కేటగిరీ కింద నమోదై ముసాయిదా జాబితా నుంచి తాత్కాలికంగా తొలగింపునకు గురయ్యాయి. వీటిలో శాశ్వతంగా నివాసాలు మారిన వారు , డబుల్ ఎంట్రీలు , మరణించిన వ్యక్తుల వివరాలు ఉన్నట్లు సీఈవో ప్రకటించారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి వంటి పట్టణ ప్రాంతాల్లోనే ఈ తరహా వలస , అన్‌ట్రేసబుల్ ఓటర్ల సంఖ్య భారీగా నమోదైంది.ఓటర్ల సంఖ్య , నివాస ప్రాంతాల మార్పుల ఆధారంగా ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపట్టింది. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ స్టేషన్ల సంఖ్య 36,353కి పెరిగింది. ఓటర్లు తమ నివాసాలకు సమీపంలో సులభంగా ఓటు హక్కు వినియోగించుకునేలా, రద్దీని నివారించేందుకు వీలుగా ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల పరిమితిని క్రమబద్ధీకరించారు.ముసాయిదా జాబితాలో పేర్లు లేని లేదా తప్పులు దొర్లిన అర్హులైన పౌరులకు మరో అవకాశం కల్పిస్తూ అభ్యంతరాలు, చేర్పుల గడువును అధికారులు ప్రకటించారు. దీని ప్రకారం సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ కొనసాగుతుంది. ఓటర్లు తమ స్థితిని సరిచూసుకుని దరఖాస్తు చేసుకోవచ్చని, అనంతరం అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
==============================

