కాంగ్రెస్ కు బీలాంగింగ్ వరమా… శాపమా…
విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 13.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ విడుదలైనప్పటి నుండి భారత రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఆమె ప్రస్తావించిన పలు కీలక చారిత్రక అంశాలను ఆయుధంగా చేసుకుని భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్‌పై ఎదురుదాడికి దిగుతోంది.
ముఖ్యంగా రాబోయే ఉత్తరప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పుస్తకంలోని అంశాలు బీజేపీకి రాజకీయంగా కలిసొచ్చే అస్త్రాలుగా మారాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బీజేపీకి అస్త్రాలుగా మారిన ప్రధాన అంశాలు,
• ఎమర్జెన్సీ ప్రస్తావన. 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ ఒక పొరపాటు అని, తర్వాత ఇందిర కూడా అదే అభిప్రాయానికి వచ్చారని సోనియా ఈ పుస్తకంలో పేర్కొన్నారు. దీనిపై బీజేపీ స్పందిస్తూ, నెహ్రూ-గాంధీ కుటుంబం చేసిన చారిత్రక తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే ఆమె ప్రయత్నిస్తున్నారని, ఈ పుస్తకానికి ‘బిలాంగింగ్’ బదులు ‘వైట్వాషింగ్’ అని పేరు పెట్టి ఉండాల్సిందని బీజేపీ అధికార ప్రతినిధి సి.ఆర్. కేశవన్ విమర్శించారు.
1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు. ఈ పుస్తకంలో 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లపై తన కుటుంబానికి క్లీన్ చిట్ ఇచ్చుకునే ప్రయత్నం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. పంజాబ్ ఎన్నికల ముంగిట ఈ అంశం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా, బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది.
ముందు తన పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో ఈ విషయంపై చర్చించినట్లు సోనియా వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను ప్రధానమంత్రి పదవి చేపట్టాలా? అని వారిని అడిగినప్పుడు ఇద్దరూ స్పష్టంగా వద్దని చెప్పారని రాశారు. ఇందిరా గాంధీ హత్య, రాజీవ్ గాంధీ హత్యను ప్రత్యక్షంగా చూసిన తమకు, తల్లి కూడా ప్రధానమంత్రి అయితే కుటుంబానికి ముప్పు పెరుగుతుందనే భయం ఉండేదని ఆమె వివరించారు. తాను ప్రధాని కావడం లేదని చెప్పినప్పుడు పిల్లలు ఎంతో ఉపశమనం పొందారని గుర్తుచేసుకున్నారు.2004 ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధానమంత్రి పదవిని స్వీకరించాలా? వద్దా? అనే విషయంలో తాను తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యానని సోనియా గాంధీ రాశారు. ఒకవైపు కాంగ్రెస్ కార్యకర్తల ఆశలు, ప్రజల నమ్మకం, మరోవైపు తన వ్యక్తిగత భయాలు, కుటుంబ భద్రత వంటి అంశాలు తనను ఆలోచనలో పడేశాయని తెలిపారు. చివరకు ప్రధానమంత్రి పదవిని తిరస్కరించాలని నిర్ణయించుకున్న రాత్రి తన మనసులోని సందేహాలన్నీ తొలగిపోయాయని పేర్కొన్నారు. తన అంతరాత్మ నుంచి ‘సోనియా.. నీకు నువ్వు నిజాయితీగా ఉండు. ఈ విషయం నీకు ఎప్పటినుంచో తెలుసు. దాన్ని వదిలేయ్!’ అనే భావన కలిగిందని పుస్తకంలో వివరించారు.తన నివాసంలో కాంగ్రెస్, సంకీర్ణ పార్టీల నేతలు ప్రధానమంత్రి పదవిని స్వీకరించాలని కోరిన సమావేశాన్ని కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ తనను ‘మీరు ప్రధానమంత్రి కావడానికి ఎందుకు అంగీకరించారు?’ అని ప్రశ్నించారని తెలిపారు. నాయకులు తన మాట వినడం లేదని, ఒత్తిడి చేస్తున్నారని తాను సమాధానమిచ్చినట్లు రాశారు. మరోవైపు ప్రియాంక గాంధీ కూడా తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారని, ఆ సమయంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారని వెల్లడించారు.తాను ప్రధానమంత్రి అయితే బీజేపీ, దాని మిత్రపక్షాలు తన విదేశీ మూలాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని సోనియా భావించారు. దీనివల్ల దేశంలో రాజకీయ వివాదం పెరిగి, ప్రభుత్వం పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందారు. తనకు ప్రధానమంత్రి పదవి కంటే దేశంలో స్థిరమైన, సమర్థవంతమైన, లౌకిక ప్రభుత్వం ఏర్పడటమే ముఖ్యమని పేర్కొన్నారు.2004లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ నేతల సమావేశంలో తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టబోనని ప్రకటించినప్పుడు పలువురు నాయకులు నిరసన వ్యక్తం చేశారని సోనియా గుర్తుచేసుకున్నారు. కొందరు నిర్ణయం మార్చుకోవాలని కోరడంతో కొద్దిసేపు ప్రసంగాన్ని ఆపాల్సి వచ్చిందని తెలిపారు. అయినప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అనంతరం డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరును ప్రధానమంత్రి పదవికి ప్రతిపాదించారు. దీంతో యూపీఏ ప్రభుత్వానికి మన్మోహన్ సింగ్ నాయకత్వం వహించారు.మొత్తంగా, ప్రధానమంత్రి పదవిని తిరస్కరించడం వెనుక కుటుంబ భద్రత, రాజకీయ పరిస్థితులు, వ్యక్తిగత సిద్ధాంతాలు కీలకంగా ఉన్నాయని సోనియా గాంధీ తన ఆత్మకథలో వివరించారు. 2004లో దేశ రాజకీయాలను మలుపు తిప్పిన తన నిర్ణయంపై ఇన్నేళ్ల తర్వాత ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.2004 ప్రధాని పదవి త్యాగం మరియు ‘సూపర్ పీఎం’. 2004లో తాను ప్రధాని పదవిని ఎందుకు వదులుకున్నానో సోనియా ఈ పుస్తకంలో వివరించారు. అయితే, 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం పడిపోయినప్పుడు సంఖ్యాబలం లేకపోయినా ఆమె ప్రధాని కావాలని ఆశపడ్డారని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది విమర్శించారు. 2004లో ప్రధాని పదవిని వదులుకున్నట్లు నటిస్తూ, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా ఉంటూ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై పెత్తనం చెలాయించి ‘సూపర్ పీఎం’ గా వ్యవహరించారని బీజేపీ దుయ్యబట్టింది.
భారత పౌరసత్వం వివాదం. 1968లో రాజీవ్ గాంధీని వివాహం చేసుకుని భారత్‌కు వచ్చిన సోనియా, 1983 వరకు అంటే 15 ఏళ్ల పాటు ఇటలీ పాస్‌పోర్టునే ఎందుకు కొనసాగించారన్న పాత వివాదాలను బీజేపీ నేతలు మళ్లీ తెరపైకి తెచ్చారు. రాజీవ్ గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించే సమయానికే ఆమె భారత పౌరసత్వం తీసుకోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని బీజేపీ ప్రశ్నిస్తోంది.
బాబ్రీ మసీదు కూల్చివేత. 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై సోనియా చేసిన వ్యాఖ్యలను కూడా బీజేపీ తప్పుబట్టింది. దశాబ్దాల పాటు భారత రాజకీయాల చక్రం తిప్పిన 10 జన్ పథ్ తెరవెనుక అధికార ప్రస్థానాన్ని, 1998లో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తీరును, యూపీఏ-1, యూపీఏ-2 సంకీర్ణ ప్రభుత్వాల నిర్వహణలోని అంతర్గత ఒత్తిళ్లను సోనియా ఈ పుస్తకంలో స్పృశించారు. నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో తన అనుబంధం, 2004లో ప్రధాని పదవిని త్యాగం చేయడం వెనుక ఉన్న అంతరంగిక నిర్ణయాలు, కాంగ్రెస్‌లోని సీనియర్ నేతల అంతర్గత కుమ్ములాటల గుట్టును బయటపెట్టడం జాతీయ స్థాయిలో తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది.ప్రతిపక్ష అధికార ఎన్డీయే కూటమి నాయకులు ఈ ఆత్మకథపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. యూపీఏ హయాంలో జరిగిన పలు ఆర్థిక కుంభకోణాలు, సూపర్ ప్రైమ్ మినిస్టర్ గా నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా సమాంతర అధికారాన్ని చెలాయించారన్న ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికే సోనియా ఈ పుస్తకం ద్వారా సింపథీ కార్డ్ ని ప్రయోగిస్తున్నారని అధికార వర్గాలు విమర్శిస్తున్నాయి. 2004-2014 మధ్యకాలంలో జరిగిన తెరవెనుక రాజకీయాలను తనకు అనుకూలమైన రీతిలో మలచుకున్నారనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ శ్రేణులు , ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు మాత్రం సోనియా రాసిన పుస్తకాన్ని సమర్థిస్తున్నాయి. దేశం కోసం భర్తను, అత్తను కోల్పోయినా.. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణకు, పార్టీ ఉనికికి ఆమె చేసిన త్యాగాలను బిలాంగింగ్ పుస్తకం ప్రపంచానికి చాటిచెబుతోందని అభివర్ణిస్తున్నారు. ఒక విదేశీ మూలాలున్న మహిళగా ఎదుర్కొన్న ఆక్షేపణలను అధిగమించి, భారతీయతను తన సొంతం చేసుకున్న తీరును ఈ పుస్తకం ప్రతిబింబిస్తుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ పుస్తక ప్రభావం కేవలం గత చరిత్రకే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సాగించే నెరేటివ్ యుద్ధానికి ప్రధాన ఇంధనంగా మారనుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల రాజకీయ ప్రస్థానానికి గాంధీ కుటుంబ త్యాగాల నేపథ్యాన్ని మరోసారి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఇది ఒక మాధ్యమంగా ఉపయోగపడనుంది. అదే సమయంలో, బీజేపీ దీనిని ఎదుర్కొనేందుకు యూపీఏ కాలం నాటి పాలనా వైఫల్యాలను, ప్యాలెస్ రాజకీయాలను తిరిగి ఎండగట్టే అవకాశం ఉంది. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ అనేది కేవలం సోనియా గాంధీ జ్ఞాపకాల సమాహారం మాత్రమే కాదు. అది ఆధునిక భారత రాజకీయ చరిత్రలోని అత్యంత కీలకమైన ఘట్టాలకు అద్దం పట్టే ఒక వివాదాస్పద పత్రం. ప్రేమ, కోల్పోవడం, సాధికారత, అధికార పోరాటాల మధ్య సాగిన ఒక మహిళ జీవిత ప్రయాణం ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్-బీజేపీల మధ్య సరికొత్త పొలిటికల్ డిబేట్‌ను రాజేసింది.యూపీ ఎన్నికల ముందు ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
మొత్తంగా, వ్యక్తిగత జ్ఞాపకాలు మరియు రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తూ సోనియా గాంధీ రాసిన ఈ పుస్తకం, కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా మారడానికి బదులు, పాత వివాదాలను మళ్లీ తవ్వితీసి బీజేపీకి రాజకీయంగా బలమైన అస్త్రాలను అందించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

