.పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 21: దేశానికి వెలుగులు అందించేందుకు సింగరేణి బొగ్గు గనుల్లో దశాబ్దాల పాటు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసిన రిటైర్డ్ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కోల్‌బెల్ట్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నూనె రాజేశం ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచాలని కోరుతూ శుక్రవారం మంథని డివిజనల్ సబ్ కోర్టు న్యాయమూర్తి అపర్ణ మల్లాదికి వినతిపత్రం అందజేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్‌ను ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సవరించాల్సి ఉన్నప్పటికీ, గత 26 ఏళ్లుగా ఆశించిన స్థాయిలో పెన్షన్ పెరగలేదని రాజేశం తెలిపారు. దీంతో వృద్ధ కార్మికులు, వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. సింగరేణి భూగర్భ గనుల్లో పని చేయడం అత్యంత ప్రమాదకరమైనప్పటికీ కుటుంబాలను పోషించేందుకు కార్మికులు ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వహించారని తెలిపారు. భూగర్భం నుంచి బొగ్గును వెలికితీసి పరిశ్రమలకు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అందించడం ద్వారా దేశాభివృద్ధిలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం అదే కార్మికులు కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో జీవించడం బాధాకరమన్నారు. నిత్యావసర వస్తువులు, వైద్య ఖర్చులు, మందుల ధరలు భారీగా పెరిగినా పెన్షన్ మాత్రం దశాబ్దాలుగా పెద్దగా పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని పెన్షన్‌తో కుటుంబాలను పోషించలేక, వైద్య ఖర్చులు భరించలేక పలువురు రిటైర్డ్ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని మృతి చెందారని తెలిపారు. మిగిలి ఉన్న వృద్ధ కార్మికులైనా గౌరవప్రదంగా జీవించేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యను పార్లమెంటులో బలంగా ప్రస్తావించి, కనీస పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నూనె రాజేశం విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో స్పందించి రిటైర్డ్ కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించాలని కోరారు. పెన్షన్‌ను ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సవరించే విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి వెలుగులు పంచిన సింగరేణి కార్మికుల వృద్ధాప్య జీవితాల్లో చీకట్లు మిగలకుండా ప్రభుత్వం కనీస పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచి వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని కోరారు. మంథని డివిజనల్ సబ్ కోర్టు న్యాయమూర్తి తమ విన్నపాన్ని సంబంధిత ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ కార్మిక సంఘం నాయకులు పోరేటి వెంకన్న, పూరెల్ల తిరుపతి, సీనియర్ న్యాయవాదులు రఘోత్తం రెడ్డి, శశిభూషణ్ కాచే, కటకం శ్రీనివాస్, చంద్రశేఖర్ రావు, కే.సదానందం తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్ రూ.10 వేలు ఇవ్వాలిమంథని డివిజనల్ సబ్ కోర్టు న్యాయమూర్తికి వినతిపత్రం
0
2
Most Popular
- Advertisment -

