డీలిమిటేషన్ అడుగులు….
విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 14.
దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన డీలిమిటేషన్ బిల్లు, 33 శాతం మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఇప్పటికీ రాష్ట్రపతి అధికారికంగా ముగించకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. భారతదేశంలో ఇప్పటివరకు 1952, 1963, 1973 మరియు 2002 సంవత్సరాల్లో డీలిమిటేషన్ కమిషన్లు ఏర్పాటయ్యాయివర్షాకాల సమావేశాలు ఇంకా ప్రొరోగ్ కానందున, కొత్త సమావేశాల కోసం 14 రోజుల గడువు అవసరం లేకుండా కేవలం 48 గంటల ముందుగా ఎంపీలకు సమాచారం ఇచ్చి ప్రత్యేక భేటీని నిర్వహించే వెసులుబాటు ప్రభుత్వానికి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంకేతాలు ఇచ్చారు.సాధారణంగా పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన రెండు నుండి నాలుగు రోజుల్లోనే రాష్ట్రపతి సభను ప్రొరోగ్ చేస్తారు. కానీ, ఈసారి వర్షాకాల సమావేశాలు వాయిదా పడి 90 రోజులకు చేరువవుతున్నా సభను అధికారికంగా ముగించకపోవడంతో 2008 నాటి 87 రోజుల రికార్డు సైతం బద్దలైంది. గత ఏప్రిల్ 17న జరిగిన ప్రత్యేక సమావేశంలో లోక్‌సభ స్థానాలను 543 నుండి 850 వరకు పెంచేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు మూడింట రెండొంతుల ప్రత్యేక మెజారిటీ లభించకపోవడంతో అది వీగిపోయింది.ఈ నేపథ్యంలో, ఈసారి పక్కా సంఖ్యాబలాన్ని కూడగట్టుకుని, ఎప్పుడైనా సరే 48 గంటల షార్ట్ నోటీసుతో సభను సమావేశపరిచి బిల్లును గట్టెక్కించాలని కేంద్రం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. జనాభాకు అనుగుణంగా రాష్ట్రంలో పలు దఫాలు అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. 1952, 1955 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కొన్ని ఉమ్మడి నియోజకవర్గాలుగా ఉండేవి. వీటిలో ఒకరు సాధారణ అభ్యర్థి, మరొకరు రిజర్వుడు అభ్యర్థిగా ఉండేవారు. ఆ తరువాత ఈ విధానం మారిపోయింది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను విభజించాలన్న డీ లిమిటేషన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాల సంఖ్య పెరిగింది.ప్రస్తుతం 175 నియోజకవర్గాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వివిధ ఎన్నికల సమయంలో ఏ విధంగా పెరిగిందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. 1955లో 245 నియోజకవర్గాలుగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎన్నికలకు 300 స్థానాలకు చేంది తర్వాత మళ్లీ తగ్గిపోయింది. దీనికి కారణం జనాభా పెరుగుదల మేరకు డీ లిమిటేషన్ సిఫార్సులే.ఎంతమంది ప్రజలకు ఎంతమంది ప్రజాప్రతినిదులు ఉండాలన్న రాజ్యాంగ నిబంధనల మేరకు డీ లిమిటేషన్ అమల్లోకి వచ్చింది. దేశంలో 1952 నాటికి 494 పార్లమెంటు స్థానాలు ఉండేవి 1962లో 522 పార్లమెంటు స్థానాలు, 3,771 అసెంబ్లీ స్థానాలకు పెరిగాయి. 1972లో 543 పార్లమెంటు స్థానాలు 3,997 అసెంబ్లీ స్థానాలుండగా ఆ సంఖ్య 2002లో 543 పార్లమెంటు స్థానాలకు, 4,123 అసెంబ్లీ స్థానాలకు చేరింది. ప్రతి పదేళ్లకు ఒకసారి చేపట్టే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్య మారుతుంటుంది. 1953లో చంద్రశేఖర అయ్యర్ అనే విశ్రాంత సుప్రీంకోర్డు న్యాయమూర్తితో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా 1973లో జేఎల్ కపూర్ అనే విశ్రాంత సుప్రీంకోర్డు న్యాయమూర్తి కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా పార్లమెంటు సభ్యులుండాలన్న ప్రతిపాదనలతో సంఖ్య పెరిగింది 2002లో నియమితులైన కులదీప్ సింగ్ అనే విశ్రాంత సుప్రీంకోర్డు న్యాయమూర్తి చేసిన సిఫార్సులు 2008 నుంచి అమల్లోకి వచ్చాయి.మరోవైపు, కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. 2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియే ‘డీలిమిటేషన్’ ఇది మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపడి ఉంది. దీనివల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో స్థానాలు పెరిగి, జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాల (తెలుగు రాష్ట్రాలతో సహా) ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.2026 తర్వాత జనాభా గణన ఆధారంగా లోక్‌సభ స్థానాల సంఖ్య 543 నుండి సుమారు 850 వరకు పెరిగే అవకాశం ఉంది. నారీ శక్తి వందన్ అధినియం (మహిళా రిజర్వేషన్ బిల్లు) ప్రకారం, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలులోకి వస్తాయి. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తర ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో స్థానాలు పెరుగుతాయి, కానీ జనాభా నియంత్రణ పాటించిన తెలుగు రాష్ట్రాలు , కేరళ, తమిళనాడు రాష్ట్రాల ప్రాతినిధ్యం (లోక్‌సభ సీట్లు) తగ్గుతుందనే భయం ఉంది. అభివృద్ధి, జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలను నష్టపరిచే విధంగా ఈ విభజన ఉండకూడదని పలువురు ఎంపీలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ బిల్లుపై రాజకీయ చర్చలు జరుగుతున్నాయి, ఇది దేశ రాజకీయ సమతుల్యతను మార్చే అవకాశం ఉన్నందున చాలా సున్నితమైన అంశంగా మారింది.రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి అవసరమైన రెండు మూడొంతుల మెజారిటీని అడ్డదారిలో కూడగట్టుకునేందుకు అమిత్ షాకు సమయం ఇవ్వడానికే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పార్లమెంట్‌ను ప్రొరోగ్ చేయకుండా జాప్యం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ డీలిమిటేషన్ బిల్లుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి నాలుగుసార్లు లేఖలు రాసినా స్పందన లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే కొద్ది రోజుల్లోనే ఢిల్లీ రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

