ePaper
Sunday, November 8, 2026
ePaper
Homeతెలంగాణసింగరేణి OCP-2 భూసేకరణలో సర్వే లోపాలు సరిచేయాలి,

సింగరేణి OCP-2 భూసేకరణలో సర్వే లోపాలు సరిచేయాలి,

📰 Generate e-Paper Clip

సింగరేణి OCP-2 భూసేకరణలో సర్వే లోపాలు సరిచేయాలి,

195 ఇళ్లకు పరిహారం నిరాకరణపై గ్రామస్థుల అభ్యంతరం.. రెండోసారి నిర్వాసితులవుతున్న కుటుంబాలకు అదనపు పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్,

అర్జున్ సమాచారం .నవంబర్ 7 రామగిరి రిపోర్టర్.

రామగిరి మండలం తెనుగుపల్లి (బుధవారంపేట) గ్రామంలో సింగరేణి OCP-2 ప్రాజెక్టు కోసం కొనసాగుతున్న భూసేకరణ ప్రక్రియలో సర్వే లోపాలను సరిచేసి, అర్హులైన ప్రతి కుటుంబానికి చట్టప్రకారం నష్టపరిహారం, పునరావాస ప్రయోజనాలు కల్పించాలని గ్రామ రైతులు, నివాసితులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా భూసేకరణ అధికారికి వినతిపత్రం సమర్పించారు. సుమారు 450 ఇళ్లు ఉన్న గ్రామంలో కేవలం 34 ఇళ్ల వివరాలనే ప్రాథమిక నోటిఫికేషన్‌లో పొందుపరిచారని, అనంతరం నిర్వహించిన సర్వేలో సుమారు 195 ఇళ్లకు పరిహారం ఇవ్వలేమని పేర్కొనడంపై గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

గత 15 సంవత్సరాలుగా భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుండటంతో గ్రామ అభివృద్ధి నిలిచిపోయిందని, ప్రజలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. గతంలో జారీ చేసిన అవార్డు నంబర్ 07/2015ను గౌరవ హైకోర్టు 15-11-2022న రద్దు చేసినట్లు గుర్తుచేశారు. అనంతరం 14-03-2023న మరోసారి భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసి, సుమారు 54 కుటుంబాల ఇళ్లకు పరిహారం కల్పించకుండానే అవార్డు నంబర్ 10/2024 జారీ చేశారని ఆరోపించారు.

ప్రస్తుతం మరోసారి భూసేకరణ ప్రక్రియ చేపడుతున్న నేపథ్యంలో గ్రామంలో నిర్వహించిన సర్వేలో అన్ని ఇళ్లకు ప్రాజెక్టు నంబర్లు కేటాయించినప్పటికీ, తదుపరి విడుదల చేసిన డిక్లరేషన్‌లో సుమారు 195 ఇళ్లకు పరిహారం ఇవ్వలేమని పేర్కొనడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ భూముల్లో నిర్మించుకున్న సుమారు 46 ఇళ్ల పరిహారంపై కూడా స్పష్టత లేదని, వాటికి సంబంధించిన వివరాలను నోటిఫికేషన్‌లో పొందుపరచలేదని తెలిపారు. సమగ్ర సంయుక్త సర్వే నిర్వహించి ప్రతి ఇంటి వివరాలను నమోదు చేయాలని కోరారు.

గతంలో అక్కపెల్లి గ్రామంలో నిర్వాసితులైన తమ కుటుంబాలు ప్రస్తుతం తెనుగుపల్లిలో మరోసారి నిర్వాసితులవుతున్నాయని గ్రామస్థులు పేర్కొన్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద కుటుంబాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. రెండోసారి నిర్వాసితులవుతున్న కుటుంబాలకు RFCTLARR చట్టం-2013లోని సెక్షన్ 39 ప్రకారం వర్తించే అదనపు పరిహారం, పునరావాస ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

సెక్షన్ 26 ప్రకారం ప్రభుత్వం సవరించిన కొత్త మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం నిర్ణయించాలని, ఇళ్లు, బోర్లు, బావులు, చెట్లు, పంటలు, ఇతర నిర్మాణాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు. సెక్షన్ 30 ప్రకారం వర్తించే 100 శాతం సోలాటియం, పునరావాసం, గృహ స్థలం, జీవనోపాధి ప్రయోజనాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామానికి సంబంధించిన R&R ప్యాకేజీ వివరాలు, ఇంటి స్థలాల విస్తీర్ణం, పునరావాస కాలనీ ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు.

అర్హులైన రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కొనసాగించడంతోపాటు, గతంలో కోల్పోయిన ఆర్థిక ప్రయోజనాలను తిరిగి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సర్వే లోపాలపై సమగ్ర విచారణ జరిపి, తీసుకున్న నిర్ణయాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. పరిహారం, పునరావాస ప్రక్రియ చట్టప్రకారం పూర్తయిన తర్వాతే భూములు, ఇళ్లను స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు.

ఇవే కాకుండా నిర్వాసిత గ్రామానికి చెందిన ఆసక్తి ఉన్న విద్యార్థులందరికీ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోని పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక ప్రవేశాలు కల్పించాలని కోరారు. సంస్థ విడుదల చేసే ఉద్యోగ నోటిఫికేషన్లలో నిర్వాసిత గ్రామ యువతకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడంతోపాటు, అర్హులైన యువతీ యువకులకు శాశ్వత లేదా ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామస్థులందరికీ సింగరేణి ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో ఉచిత వైద్య సేవలు, వైద్య పరీక్షలు, మందులు అందించాలని విజ్ఞప్తి చేశారు.

తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, అయితే పేద కుటుంబాలు రెండోసారి నిర్వాసితులై అన్యాయానికి గురికాకుండా చట్టప్రకారం పూర్తి పరిహారం, పునరావాసం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గ్రామస్థులు స్పష్టం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు భూసేకరణ ప్రక్రియను నిలిపివేయాలని, అవసరమైతే రద్దు చేయాలని కోరారు. లేనిపక్షంలో తమ హక్కుల సాధన కోసం మరోసారి గౌరవ హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!