అమెరికన్ దేశంలోనీ మార్కెట్లోకి తెలంగాణ బియ్యం.
హైదరాబాద్, అక్టోబరు 23, (అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 23.
తెలంగాణలోని రాష్ట్రము లోని రైతులు పండించిన బియ్యం త్వరలో అమెరికా మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. హనుమకొండ జిల్లా ముల్కనూర్ గ్రామానికి చెందిన రైతులు తమ బ్రాండెడ్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతున్నారు. గ్రామీణ రైతుల సమష్టి కృషికి ప్రతీకగా నిలిచిన ముల్కనూర్ కోఆపరేటివ్ రూరల్ క్రెడిట్ అండ్ మార్కెటింగ్ సొసైటీ ఈ దిశగా కీలక అడుగు వేసింది. అమెరికాకు చెందిన హార్వెస్ట్‌లింక్ సహకార సంస్థతో కలిసి అక్కడి మార్కెట్‌లో తెలంగాణ సోనా, జై శ్రీరామ్ బియ్యాన్ని విక్రయించేందుకు ప్రణాళిక రూపొందించింది. తొలి విడతలో 25 టన్నుల బియ్యాన్ని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైన నియంత్రణ సంస్థల అనుమతులు లభిస్తే నెల రోజుల్లో తొలి సరుకు అమెరికాకు చేరే అవకాశం ఉంది.ముల్కనూర్ గ్రామంలో రైతులకు వ్యవసాయానికి అవసరమైన అనేక సేవలు ఒకే చోట అందుబాటులో ఉండటం ఈ సహకార సంఘం ప్రత్యేకత. విత్తనాలు, ఎరువుల నుంచి వ్యవసాయ పరికరాలు, పంట రుణాలు, దిగుబడుల నిల్వ, మార్కెటింగ్ వరకు రైతులకు అవసరమైన సదుపాయాలను ఈ సంఘం కల్పిస్తోంది. 1956లో కేవలం 373 మంది సభ్యులతో, రూ.2300 వాటా మూలధనంతో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం 7500 మందికి పైగా సభ్యులతో అభివృద్ధి చెందింది. రైతులే సభ్యులుగా, యాజమాన్య భాగస్వాములుగా వ్యవహరిస్తుండటంతో సంస్థ కార్యకలాపాల్లో వారికి ప్రత్యక్ష భాగస్వామ్యం లభిస్తోంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఈ సంఘంలో నిరర్థక ఆస్తులు దాదాపు జీరో స్థాయిలో ఉండగా.. ఉద్యోగుల్లో సుమారు 90 శాతం మంది రైతు కుటుంబాలకు చెందినవారే కావటం విశేషం.గ్రామానికి చెందిన 45 ఏళ్ల రైతు బొల్లంపల్లి కుమారస్వామి కుటుంబం మూడు తరాలుగా ఈ సహకార సంఘంతో అనుబంధం కలిగి ఉంది. మూడు ఎకరాల భూమి ఉన్న ఆయన సంఘం పాలకవర్గంలోనూ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. రైతులు దళారులపై ఆధారపడకుండా.. వ్యవసాయ అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా గ్రామంలోనే పరిష్కారాలు పొందుతున్నారని ఆయన తెలిపారు. సంఘానికి సొంత గోదాములు ఉండటంతో పంట నాణ్యతను కాపాడుకోవడంతోపాటు, నిల్వ సదుపాయాలను వినియోగించుకునే అవకాశం ఉందని వివరించారు.పంట సాగుకు ముందే రైతులకు విత్తనాలు అందించడం, పంట చేతికొచ్చిన తర్వాత దిగుబడులను కొనుగోలు చేయడం ఈ సంఘం ప్రధాన సేవల్లో భాగం. కనీస మద్దతు ధరతోపాటు క్వింటాలుకు రూ.200 నుంచి రూ.400 వరకు బోనస్ కూడా అందిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. పంట నాణ్యతను క్రమం తప్పకుండా పరిశీలించడం, నిల్వ సదుపాయాలు కల్పించడం ద్వారా నాణ్యమైన ఉత్పత్తులను మార్కెట్‌కు అందించేందుకు సహకరిస్తోంది. పంట రుణాలను సుమారు 7 శాతం వడ్డీతో, మధ్య, దీర్ఘకాలిక రుణాలను 10 శాతం వడ్డీతో అందిస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. రుణాల మంజూరులో ఒకరోజులోనే ప్రక్రియ పూర్తయ్యే సదుపాయం ఉందని కుమారస్వామి తెలిపారు. వ్యవసాయ రుణాలతోపాటు పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, ఇతర అవసరాలకూ ఆర్థిక సహకారం అందుతోందని చెప్పారురైతుల సమష్టి భద్రతకు సహకార వ్యవస్థ మంచి మార్గమని పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలు కొంత ఆర్థిక సాయం అందించినప్పటికీ దీర్ఘకాలిక భరోసా కల్పించడంలో రైతు సహకార సంఘాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో తెలంగాణ సోనా, జై శ్రీరామ్ వంటి బ్రాండ్లతో బియ్యం విక్రయిస్తున్న ముల్కనూర్ సంఘం ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌పై దృష్టి సారించిందని చెప్పారు. అమెరికాలోని భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజల నుంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తు్నారు. విదేశీ మార్కెట్లలో దేశీయ ధరల కంటే 10 నుంచి 15 శాతం అధిక ధర లభించే అవకాశం ఉందని సంఘం భావిస్తోంది. ఎగుమతులు విజయవంతమైతే ముల్కనూర్ రైతులకు కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావడంతోపాటు, సహకార వ్యవసాయ సంఘానికి అంతర్జాతీయ గుర్తింపు లభించే అవకాశం ఉంది

