బోయిన్‌పేట యువకుల సాహసం స్పూర్తిదాయకంనేటి యువతకు అరవింద్, రాజశేఖర్‌లు ఆదర్శం : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్.
పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 24.
పదకొండు రోజుల క్రితం మంథని పట్టణంలోని బొక్కలవాగులో మునిగిపోతున్న బాలికను తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రక్షించిన బోయిన్‌పేట యువకుల సాహసం స్పూర్తిదాయకమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. సోమవారం మంథని పట్టణంలోని రాజగృహాలో బోయిన్‌పేటకు చెందిన అంకం రాజశేఖర్, ఆకుల అరవింద్ అనే ఇద్దరు యువకులను శాలువాలతో సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ బోయిన్‌పేటకు చెందిన పర్శవేని రాజు యాదవ్ అలియాస్ ఆర్‌కే యాదవ్ గొర్లను మేపుకుంటూ బొక్కలవాగు దాటే క్రమంలో వాగులో మునిగిపోయాడని తెలిపారు. నీటిలో మునిగిపోతున్న తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన ఆయన కుమార్తె కూడా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయిందని పేర్కొన్నారు. బాలిక నీటిలో మునిగిపోతూ కేకలు వేయడంతో సమీపంలోని గోదాంలో పనికి వెళ్తున్న అంకం రాజశేఖర్, ఆకుల అరవింద్‌లు ఆమె కేకలు విని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాగులోకి దూకారని తెలిపారు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బాలికను సురక్షితంగా రక్షించి గొప్ప సాహసం చేశారని కొనియాడారు.
నేటి యువతలో కొందరు చెడు మార్గాల వైపు పయనిస్తున్న తరుణంలో రాజశేఖర్, అరవింద్‌లు ప్రదర్శించిన ధైర్యసాహసాలు యువతరానికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈత నేర్చుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో ఈత పరిజ్ఞానం ఎంతో మంది ప్రాణాలను కాపాడగలదని సూచించారు. అనంతరం సాహసం చేసిన యువకులతో కలిసి అల్పాహారం స్వీకరించారు.

